అతి తక్కువ గ్యాప్ లో తమ కుటుంబానికి సంబంధించిన రెండు శుభవార్తలు పంచుకున్న నాగార్జున ఇద్దరు కొడుకులు వైవాహిక జీవితాల్లోకి అడుగుపెట్టే క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4 అన్నపూర్ణ స్టూడియోస్ లో పరిమిత అతిథుల మధ్య జరగబోతున్న సంగతి తెలిసిందే. బాగా సన్నిహితులైన మూడు వందల అతిథుల మధ్య ఏఎన్ఆర్ విగ్రహం సాక్షిగా ఈ మధురఘట్టం జరగబోతోంది. ఈ ఆనందాన్ని ఫ్యాన్స్ ఆస్వాదిస్తూ ఉండగానే అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రవ్ జీ తో జరిగిన గుడ్ న్యూస్ ని వెంటనే పంచుకున్నారు నాగ్. దీంతో అభిమానులు డబుల్ హ్యాపీ.
అయితే రెండు వేడుకలు ఒకేసారి జరుగుతాయన్న ప్రచారాన్ని నాగ్ కొట్టిపారేశారు. ముందు చైతు పెళ్ళయ్యాక 2025 ప్రారంభంలో అఖిల్ ది జరిపించేలా ప్లాన్ చేస్తున్నారట. మాములుగా హిందూ సంప్రదాయాల్లో ఒకే రోజు అన్నదమ్ముల పెళ్లిళ్లు చేయడం అరుదు. మంచిది కాదని కూడా అంటారు. సినిమాల్లో చేసినట్టు చూపిస్తారు కానీ నిజ జీవితంలో తక్కువ. అందుకే చైతు, అఖిల్ వేడుకలు వేర్వేరుగా ఉండబోతున్నాయి. నెట్ ఫ్లిక్స్ చైతు పెళ్లి హక్కులను యాభై కోట్లకు తీసుకుందనే ప్రచారానికి చెక్ పెడుతూ అలాంటిదేమి లేదని అక్కినేని ఫ్యామిలీ నుంచి మొన్నే క్లారిటీ వచ్చేసింది.
అఖిల్ పెళ్ళి ఎక్కడ ఎప్పుడు జరగబోతోందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ముహూర్తం తదితర వివరాలు ఇంకా వెల్లడి చేయలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే తండేల్ ఫిబ్రవరిలో విడుదల కానుండగా అఖిల్ 6 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. నాగార్జున కుబేర, కూలిలతో వచ్చే సంవత్సరం పలకరించబోతున్నారు. కొంత కాలంగా హిట్ లేక డల్లుగా ఉన్న అక్కినేని ఫ్యాన్స్ కు 2025 ఫుల్ జోష్ ఇవ్వనుంది. బ్రదర్స్ పెళ్లిళ్లతో పాటు కొత్త రిలీజులు వరసగా సందడి చేయబోతున్నాయి. ఫ్యామిలీలో అడుగు పెట్టబోతున్న శోభిత, జైనబ్ లు ఎలాంటి లక్కు తీసుకొస్తారో చూడాలి.