అక్కినేని నాగచైతన్య మళ్లీ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. సమంత నుంచి విడిపోయాక కొన్నేళ్లు సింగిల్‌గా ఉన్న అతను.. బాలీవుడ్లో స్థిరపడ్డ తెలుగు నటి శోభిత ధూళిపాళ్ళతో ప్రేమలో పడడం.. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టులో ఈ జంట నిశ్చితార్థం చేసుకోవడం తెలిసిందే. డిసెంబరు 4న పెళ్లి వేడుక జరగబోతోంది. అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే వివాహం జరిపించబోతున్నారు. ఇందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ పెళ్లిని డాక్యుమెంటరీగా తీసి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేయబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడా వార్తలు నిజమేనని రూఢి అయింది. చైతూ-శోభితల పెళ్లి డాక్యుమెంటరీ కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.50 కోట్ల చెల్లించబోతోందట. ఈ రేటు గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చైతూ-శోభిత పెళ్లికి మీడియాకు ప్రవేశం ఉండట్లేదు. చాలా కొద్దిమంది సెలబ్రెటీలను మాత్రమే పిలుస్తున్నారు. సెలబ్రెటీలు తమ పెళ్లి వీడియోలను స్ట్రీమింగ్ సంస్థలకు అమ్ముకోవడం ఇది తొలిసారేమీ కాదు. బాలీవుడ్లో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు సౌత్‌కూ విస్తరిస్తోంది. ఇటీవలే నయనతార-విఘ్నేష్ శివన్‌ల పెళ్లి డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ చేయడం తెలిసిందే. దానికి రూ.25 కోట్ల రేటు పలికినట్లు వార్తలు వచ్చాయి.
నయన్ డాక్యుమెంటరీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే రావడంతో చైతూ-శోభిత మ్యారేజ్ వీడియోకు డబుల్ రేటు ఇస్తోందట నెట్ ఫ్లిక్స్. అక్కినేని కుటుంబంలో పెళ్లి, పైగా శోభితకు బాలీవుడ్లో మంచి పేరుంది. హిందీ ఆడియన్స్ కూడా బాగా చూస్తారు. అందుకే ఈ రేటు కావచ్చు. నయన్ డాక్యుమెంటరీ కోసం బైట్ ఇచ్చిన నాగ్.. కొడుకు పెళ్లి డాక్యుమెంటరీకి అదిరిపోయే డీల్ తెచ్చాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.