ఆ సినిమా చూస్తా.. మీరూ చూడండి-సీఎం

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తాను ఓ సినిమా చూడబోతున్నానని చెప్పడం.. అంతే కాక తమ పార్టీ నేతలు, మంత్రులు కూడా ఆ సినిమా తప్పక చూడాలని సూచించడం అంటే విశేషమే. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఇవే వ్యాఖ్యలు చేసి ఆశ్చర్యపరిచారు. ఆయన్ని అంతగా ఇంప్రెస్ చేసిన సినిమా.. సబర్మతి రిపోర్ట్. 2002లో దేశాన్ని కుదిపేసిన గోద్రా అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ‘కశ్మీర్ ఫైల్స్’ తరహాలోనే బీజేపీ ప్రాయోజిత సినిమాగా దీన్ని భావిస్తున్నారు.

గోద్రా అల్లర్ల సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎంత అన్ పాపులర్ అయ్యారో తెలిసిందే. ఐతే ఆ సమయంలో ఏం జరిగిందో అసలు వాస్తవాలు చూపించే సినిమాగా దీన్ని బీజేపీ మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ప్రేక్షకుల స్పందన కూడా బాగుంది.

మోడీని పాజిటివ్ కోణంలో చూపించిన సినిమా కావడంతో మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ చిత్రానికి పన్ను మినహాయింపును ఇవ్వడం విశేషం. ఈ మేరకు ప్రకటన చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యయంత్రి మోహన్ యాదవ్.. తాను త్వరలో ఈ సినిమాను చూడబోతున్నట్లు చెప్పారు. అంతే కాక తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ఈ సినిమా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

గోద్రా ఘటన ఒక చేదు గతం అని.. దీని మీద చెత్త రాజకీయాలు చేసిన కొన్ని రాజకీయ పార్టీలు అసలు వాస్తవాలను కప్పి పెట్టాయని.. ఇప్పుడు ‘సబర్మతి రిపోర్ట్’ ద్వారా వాస్తవాలు బయటికి వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ధీరజ్ సర్నా దర్శకత్వంలో తెరకెక్కిన ‘సబర్మతి రిపోర్ట్’లో విక్రాంత్ మాసే, రాశి ఖన్నా, రిధి డోగ్రా ముఖ్య పాత్రలు పోషించారు. దీన్ని ప్రాపగండా మూవీగా విమర్శకులు ముద్ర వేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడుతోంది.