ముగ్గురు మావయ్యలు.. తేజు పాఠాలు

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు సాయిదుర్గాతేజ్. తొలి చిత్రం ‘రేయ్’‌ చాల ా ఆలస్యమై, విడుదలకు నోచుకోక ఇబ్బంది పడినా.. తొలి రిలీజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’తో అతడి కెరీర్‌కు మంచి ఆరంభం దక్కింది. ఆపై వరుసగా హిట్లు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించాడు. మధ్యలో వరుస ఫ్లాపులు, రోడ్డు ప్రమాదం అతణ్ని వెనక్కి లాగినా.. ‘విరూపాక్ష’తో తిరిగి పట్టాలెక్కాడు.

ప్రస్తుతం రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో తేజు భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతలో హీరోగా పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు తేజు. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో అతను తన సినీ ప్రయాణం గురించి మాట్లాడాడు. తన ముగ్గురు మావయ్యలు తనపై చూపించిన ప్రభావం గురించి ఈ ఇంటర్వ్యూలో అతను వివరించాడు.

“పెద్ద మావయ్య చిరంజీవి గారి నుంచి నేను పట్టుదలను నేర్చుకున్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదేమైనా గానీ ఒకటి అనుకుంటే దాని వెనుకే తిరుగుతూ అనుకున్నది సాధించాలనే పట్టుదలను ఆయన్నుంచి నేర్చుకున్నాను. కళ్యాణ్ మావయ్య నుంచి కమిట్మెంట్ గురించి తెలుసుకున్నా. ఒక పని ఎంచుకున్నా.. ఏదైనా మాట ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదు, దాన్ని పూర్తి చేయాలి అనే కమిట్మెంట్‌ను ఆయన్నుంచి నేర్చుకున్నా. నాగబాబు మావయ్య నుంచి నేను తీసుకున్నది నవ్వు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన ముఖంలో నవ్వు చెరగదు. మనం నవ్వుతూ ఉంటే కష్టాలు పక్కకు వెళ్లిపోతాయని ఆయన్నుంచి తెలుసుకున్నా.

ముగ్గురిలో కళ్యాణ్ మావయ్యతో నాకు అనుబంధం ఎక్కువ. చిన్నప్పటి నుంచి నన్ను అన్ని రకాలుగా ట్రైన్ చేసింది ఆయనే. మా అమ్మ ఏ పని ఉన్నా.. నన్ను కళ్యాణ్ మావయ్య దగ్గర వదిలేసేది. ఆయన ప్రతి విషయం నేర్పించారు. ఒకసారి టెన్నిస్ టోర్నీలో ఓడిపోయి ఇకపై ఆ ఆట ఆడను అంటే, ఓటమితో ఆగిపోకూడదు, ప్రయత్నం చేయాల్సిందే అని చెప్పారు. నేను తర్వాత టోర్నీలో గెలిచి వచ్చాను. అప్పుడు వెనక నుంచి వచ్చి నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టారు. కళ్యాణ్ మావయ్య ఎన్నికల్లో గెలిచినపుడు నేను కూడా అచ్చం అలాగే చేశాను. నాకు నటనలో శిక్షణ ఇప్పించింది ఆయనే. నన్ను అన్ని రకాలుగా మోటివేట్ చేశారు. ఆయనతో కలిసి ‘బ్రో’ సినిమా చేయడం నా జీవితంలో పెద్ద అచీవ్మెంట్ అనుకుంటా. 25 రోజుల పాటు ఆయనతో కలిసి గడపడం నాకు గొప్ప అనుభూతి. అది నా గురువుకు నేనిచ్చిన గురుదక్షిణగా భావిస్తా” అని తేజు చెప్పాడు.