నాగార్జున.. కొత్త‌గా ఈ కాంబినేష‌నేంటి?

ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు అక్కినేని నాగార్జున‌. గ‌త కొన్నేళ్లలో ఓం న‌మో వేంక‌టేశాయ‌, ఆఫీసర్, మ‌న్మ‌థుడు-2 లాంటి డిజాస్ట‌ర్లు ఖాతాలో వేసుకున్న ఆయ‌న‌.. ప్ర‌స్తుతం వైల్డ్ డాగ్ మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది పూర్త‌వ‌గానే ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేశాడు. దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది.

మ‌రోవైపు నాగార్జున కోసం ఎప్ప‌ట్నుంచో బంగార్రాజు స్క్రిప్టు కూడా రెడీ అవుతోంది. ఇంత‌లో నాగార్జున‌తో క‌లిపి ఓ క్రేజీ డైరెక్ట‌ర్ పేరు వినిపిస్తుండ‌టం విశేషం. ఆ పేరు మ‌రెవ్వ‌రిదో కాదు.. అనిల్ రావిపూడిది. ప‌టాస్‌తో మొద‌లుపెట్టి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కు వ‌రుస‌గా హిట్లు ఇస్తూ వ‌చ్చాడు అనిల్. దీని త‌ర్వాత ఎఫ్‌-3 స్క్రిప్టు పూర్తి చేశాడ‌త‌ను. ఐతే ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. ఈలోపు అనిల్ వేరే సినిమా చేస్తాడ‌ని కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

దాని సంగతేమో కానీ.. ‘ఎఫ్-3’ పూర్తి చేశాక నాగార్జునతో అనిల్ సినిమా ఉంటందంటూ కొత్త‌గా ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. గత కొన్నేళ్లలో నాగ్ ఎక్కువగా సీరియస్ సినిమాలే చేశాడు. ఇప్పడు నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’, దీని తర్వాత చేయబోయే ప్రవీణ్ సత్తారు సినిమా కూడా సీరియస్ మూవీసే. దీని తర్వాత ‘బంగార్రాజు’ చేస్తే అది ఎంటర్టైనరే అయ్యేది కానీ.. ఆ సినిమా నాగ్ చేస్తాడా లేదా అన్నది ఒక పట్టాన తేలట్లేదు. కొన్నేళ్లుగా దాని పని నడుస్తోంది. ఎంతకీ తెగట్లేదు. దాని సంగతి తేల్చకుండా అనిల్ దర్శకత్వంలో ఓ ఎంటర్టైనర్ చేయడానికి నాగ్ సన్నాహాలు చేసుకుంటున్నాడని చెబుతున్నారు.

అనిలే ఆయ‌న్ని సంప్ర‌దించాడ‌ని.. వీళ్ల క‌ల‌యిక‌లో సినిమా వ‌చ్చే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. మ‌రోవైపు అనిల్ మరో సీనియర్ హీరో బాల‌కృష్ణ‌తో కూడా ఓ సినిమా చేయాల‌ని ఆశ‌ప‌డుతుండ‌గా.. ఆయ‌న ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు.