సానుభూతి పని చేయదు కంగువా

బాక్సాఫీస్ వద్ద కంగువ తుది తీర్పు వచ్చేసింది. మొదటి వీకెండ్ ఏమైనా అద్భుతాలు జరిగి ఉంటే ఆశలు పెట్టుకుని ఉండొచ్చేమో కానీ పద్దెనిమిదో రోజులో ఉన్న అమరన్ కంటే నాలుగో రోజు కంగువ తక్కువ వసూలు చేయడాన్ని ఏ కోణంలో చూసినా ఫ్లాప్ కన్నా చిన్న మాట వాడలేం. తమిళ వెర్షన్ మెరుగ్గానే ఉన్నా అది కూడా రికార్డుల దిశగా వెళ్లడం లేదు. ఆదివారం మాత్రమే తమిళనాడులో మంచి ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. దత్తపుత్రుడుగా తెలుగు ఆడియన్స్ అభిమానించే ఏపీ, తెలంగాణలో నిన్న విపరీతమైన డ్రాప్స్ కనిపించడం తీవ్ర నష్టాలు ఖరారు చేసింది. డబ్బింగుల రికవరీ అయ్యేపనిలా లేదు.

అయితే కంగువ కావాలని కొందరు నెగటివ్ చేశారని, కోలీవుడ్ రివ్యూలను కొన్ని దురుద్దేశాలు మనసులో పెట్టుకుని రాశారని సూర్య వర్గం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరగడం ఫ్యాన్స్ ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. జ్యోతిక ఇన్స్ టాలో పెట్టిన పోస్ట్ ద్వారా మొదటి ఇరవై నిముషాలు మినహాయించి కంగువ విజువల్ వండర్ లా ఉందని, మంచి విషయాలు పక్కనపెట్టి మైనస్సులను హైలైట్ చేయడం వెనుక ఎవరో ఉండటం విచారకరం అనే రీతిలో పేర్కొంది. సూర్య భార్యగా కాక ఒక మూవీ లవర్ గా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాని ఆవిడ చెప్పుకొచ్చారు. జ్యోతికకు మద్దతుగా కొందరు ఫ్యాన్స్ గొంతు కలిపారు.

ఏది ఏమైనా సానుభూతి అన్ని వేళలా పనిచేయలేదు. ఎవరో క్యాంపైన్ చేస్తే తగ్గిపోవడానికి సూర్య చిన్న హీరో కాదు. బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్ డం తన సొంతం. వివాదాలకు దూరం. సౌమ్యంగా ఉంటాడు. సంఘ సేవ చేస్తాడు. రాజకీయాల ఊసే ఉండదు. అలాంటిది సినిమా బాగుంటే ఎవరు బురద చల్లాలని చూసినా వర్కౌట్ కాదు. కంగువలో కథతో మొదలుపెట్టి స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్ ఇలా ఎన్నో విషయాల్లో విమర్శలున్నాయి. అవి తీవ్ర ప్రభావం చూపించాయి కాబట్టి కంగువకి సీన్ రివర్స్ అయ్యింది. అంతే తప్ప సింపతి కార్డుతో వసూళ్లను, పబ్లిక్ టాక్ ఆశించడం ఎంత మాత్రం రైట్ కాదు.