హీరోలను డిక్టేట్ చేసే దమ్ముందా?

కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఇటు ఆర్టిస్టులు, అటు టెక్నీషియన్లు పారితోషకాలు తగ్గించుకోవాల్సి ఉంటుందని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ స్పష్టం చేసింది. 20 శాతం పారితోషకాలు తగ్గించుకునేలా ఒక తీర్మానం కూడా చేశారు. అందుకు ఆర్టిస్టులు, టెక్నీషియన్ల నుంచి కూడా ఆమోదం లభించినట్లు చెబుతున్నారు. ఐతే తీర్మానం అయితే చేశారు కానీ.. దీన్నెంత వరకు అమలు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

సినిమాల పారితోషకాల్లో మెజారిటీ వాటా హీరోలదే. మిగతా అందరి పారితోషకాల్ని మించి ఒక్క హీరోకే ఇవ్వాల్సిన సినిమాలు చాలానే ఉంటాయి. స్టార్ హీరోలందరి సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతుంటుంది. ఐతే నిర్మాతలు నామమాత్రంగా మారిపోయి హీరోల రాజ్యమే నడుస్తున్న టాలీవుడ్లో వాళ్లను పారితోషకాల విషయంలో డిక్టేట్ చేసేంత సీన్ ఉందా అన్నది సందేహం.

టాలీవుడ్లో నిర్మాతల ఆదేశాల్ని పాటించే హీరోలూ తక్కువే. అలాగే హీరోలను డిక్టేట్ చేయగలిగే నిర్మాతలూ తక్కువే. హీరో డేట్లు ఇస్తే చాలు.. కథ కూడా చేతిలో లేకుండా కాంబినేషన్లు సెట్ చేసుకునే నిర్మాతలే చాలామంది కనిపిస్తారు. ఇందుకోసం హీరోలు భారీ పారితోషకాలు ఆఫర్ చేసి వాళ్లను లాక్ చేసే కల్చర్ బాగా ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలోనే ఒక హీరో చివరి సినిమా డిజాస్టర్ అయినా సరే.. తర్వాతి సినిమాకు పారితోషకం పెరిగిపోతుంటుంది. కేవలం రెమ్యూనరేషన్ ఆఫర్లతోనే హీరోలను నిర్మాతలు లాక్ చేస్తున్నారు. అందుకే హీరోలకు ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ అంటూ ఉండట్లేదు. ఆ విషయంలో క్లారిటీ ఉంటే.. అందులో 20 శాతం కోత విధించవచ్చు. ముందు సినిమాకు తీసుకున్న దానికంటే కొన్ని కోట్లు పెంచి అందులో 20 శాతం కోత వేసుకోమంటే నిర్మాతలు ఏం చేయగలరు?

పారితోషకాలకు తోడు హీరోలు పెట్టుబడి లేకుండా కాల్ షీట్స్‌కు బదులుగా తమ నిర్మాణ సంస్థనో లేదంటే స్నేహితుడినో పార్టనర్‌గా చేర్చి లాభాల్లోనూ వాటాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఐతే హీరో తమకు సినిమా చేయడమే గొప్ప అనుకుంటూ నిర్మాతలు అన్నింటికీ తలొగ్గుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హీరోల పారితోషకాల్లో కోతలు విధించడం అంటే అసాధ్యమనే చెప్పాలి. వాళ్ల రెమ్యూనరేషన్లు తగ్గించకుండా బడ్జెట్లు ఏం తగ్గుతాయి?