కీటో డైట్ న‌టి ప్రాణం తీసిందా?

మిస్తి ముఖ‌ర్జీ అని ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన బెంగాలీ న‌టి బెంగ‌ళూరులో హ‌ఠాత్తుగా క‌న్నుమూయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆమె వ‌య‌సు 27 ఏళ్లు మాత్ర‌మే. అధిక బ‌రువు ఉన్న ఈ అమ్మాయి.. బ‌రువు త‌గ్గించుకునేందుకు కొంత కాలంగా కీటో డైట్ ఫాలో అవుతున్న‌ట్లు స‌మాచారం.

ఐతే ఆ డైట్ తేడా కొట్టి ఆమె కిడ్నీల‌పై ప్ర‌భావం ప‌డింద‌ట‌. ఒక కిడ్నీ పాడై.. తీవ్ర‌మైన నొప్పితో అల్లాడిపోయిన మిస్తి ఆసుప‌త్రిలో చేరింది. అక్క‌డి చికిత్స పొందుతూ ప్రాణాలు వ‌దిలిన‌ట్లు అక్క‌డి మీడియా చెబుతోంది.

మిస్తి బెంగాలీతో పాటు కొన్ని హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టించింది 2012లో లైఫ్ కి తో ల‌గ్ గ‌యి సినిమాతో ఆమె తెరంగేట్రం చేసింది. మిస్తి.మోడ‌లింగ్ కూడా చేసింది. ఎన్నో సినిమాలు, మ్యూజిక్ వీడియోల ద్వారా త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్న మిస్తి ముఖ‌ర్జీ ఇక లేరు.

కీటో డైట్ వ‌ల్ల ఆమె కిడ్నీ పాడైంది. చికిత్స పొందుతూ బెంగ‌ళూరులో మిస్తి చ‌నిపోయింది. చ‌నిపోయేముందు ఆమె తీవ్రమైన నొప్పిని అనుభ‌వించింది. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాలి. మిస్తికి త‌ల్లిదండ్రులు, సోద‌రుడు ఉన్నారు అని మిస్తి త‌ర‌ఫు వారు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించారు.

కీటో డైట్ వ‌ల్లే మిస్తి ప్రాణం పోయిందని ఆమె త‌ర‌ఫువారు ప్ర‌క‌టించారు అంటే.. ఈ డైట్ ప‌ట్ల జ‌నాల్లో ఆందోళ‌న‌, సందేహాలు క‌ల‌గ‌డం ఖాయం. ఈ డైట్ ప్ర‌కారం తినే తిండిలో 75 శాతం కొవ్వు, 20 శాతం ప్రొటీన్, 5 శాతం కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి.