డిసెంబర్ 5 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ మేనియా ఏ స్థాయిలో ఉందో సగటు ప్రేక్షకులకు కూడా అర్థమైపోతోంది. ఓవర్సీస్ లో ఇప్పటికే అర మిలియన్ వసూళ్లతో నెలముందే ఊచకోత మొదలుపెట్టగా, ఏరియాల వారిగా తెలుగు రాష్ట్రాల బయ్యర్లు ఇస్తున్న ఆఫర్లు చూసి డిస్ట్రిబ్యూటర్లకు మతులు పోతున్నాయి. అటు ఉత్తరాదిలోనూ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది.
అయితే పుష్ప 2 కన్నా ముందు డిసెంబర్ 6 డేట్ లాక్ చేసుకున్న మరో ప్యాన్ ఇండియా మూవీ చావా. విక్కీ కౌశల్ హీరోగా నటించగా ఇందులో కూడా రష్మిక మందన్న హీరోయిన్ కావడం గమనార్షం. ఇక్కడ కొన్ని ట్విస్టులున్నాయి.
చావా బ్యాక్ డ్రాప్ ఛత్రపతి శివాజీ వారసుడు శంభాజీ బయోపిక్. మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈయన చరిత్ర తెలియని వారు ఉండరు. అందుకే వందల కోట్లు ఖర్చుపెట్టి తెరకెక్కించారు. ఒకవేళ దీంతో క్లాష్ వస్తే ఓపెనింగ్స్ దెబ్బ తింటాయనే ఉద్దేశంతో పుష్ప 2 ఒక రోజు ముందుకు జరిపారనే కథనాలు కొన్ని వచ్చాయి.
కానీ నిజానికి జరుగుతోంది రివర్స్. పుష్ప 2 ప్రభంజనం చూస్తూ చావా దర్శక నిర్మాతలు వాయిదా వేసుకునే ఆలోచన సీరియస్ గా చేస్తున్నారట. తమది కూడా వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ అయినప్పటికీ బజ్ విషయంలో వెనుకబడటాన్ని గుర్తించారట.
ఈ నేపథ్యంలో పోస్ట్ పోన్ చేయాలా వద్దా అనే మీమాంసలో చావా టీమ్ కొట్టుమిట్టాడుతున్నట్టు ముంబై టాక్. నిజానికి పుష్ప 2తో క్లాష్ కాకపోవడం ఉత్తమం. ఎందుకంటే చావా ఒకటి రెండు రాష్ట్రాల్లో ప్రభావం చూపించినా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళలో అల్లు అర్జున్ హవాని తట్టుకోవడం కష్టం.
పైగా థియేటర్లు దొరకవు. ఓవర్సీస్ లోనూ ఇదే సీన్ ఉంటుంది. ఈ గొడవంతా ఎందుకనుకుంటే చావాని రేసు నుంచి తప్పించడం మంచి ఆప్షన్. విక్కీ కౌశల్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన చావాని సోలోగా రిలీజ్ చేసుకుంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్లు పునరాలోచనలో పడ్డారు. చూడాలి మరి ఏం చేస్తారో.