మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఎంత నామమాత్రంగా ఉంటాయో తెలిసిందే. కథానాయికలకు మంచి గుర్తింపు ఉన్న పాత్రలు పది సినిమాల్లో ఒకటి రెండు ఉండడం కూడా కష్టమే. ముఖ్యంగా కమర్షియల్ చిత్రాలే రాజ్యమేలే టాలీవుడ్లో హీరోయిన్ల పాత్రలు హైలైట్ అవడం అరుదే.
ఐతే ఈ దీపావళికి మాత్రం సీన్ మారింది. పండక్కి రిలీజైన మూడు చిత్రాల్లోనూ హీరోయిన్ల పాత్రలు బాగా హైలైట్ అయ్యాయి. కథల్లో వారి పాత్రలు చాలా కీలకంగా ఉన్నాయి. హీరోయిన్లు కూడా చక్కటి నటనతో ఆకట్టుకున్నారు. వారి కెరీర్లలో ఈ సినిమాలు, పాత్రలు ప్రత్యేకంగా నిలిచిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి.
దీపావళి సినిమాల్లో హీరోయిన్ పాత్ర బాగా హైలైట్ అయిన సినిమా అంటే ‘అమరన్’యే. అందులో సాయిపల్లవి కథానాయిక పాత్ర చేసింది. మామూలుగా సాయిపల్లవి సినిమాల ఎంపికే ప్రత్యేకంగా ఉంటుంది. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఆమె సినిమా అంగీకరిస్తుంది. తన నటన కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ‘అమరన్’ సినిమాకు తెలుగులో మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటే ప్రధాన కారణం ఆమే. ఇందులో మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్య పాత్రలో సాయిపల్లవి జీవించేసింది. తన నటన ప్రేక్షకులను కదిలించేసింది. ఇప్పటికే చాలా మంచి పాత్రలు చేసిన సాయిపల్లవికి ఇది మరో మైల్ స్టోన్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు.
ఇక ‘లక్కీ భాస్కర్’లో మీనాక్షి చౌదరి కూడా చాలా మంచి పాత్ర చేసింది. ఇప్పటిదాకా గ్లామర్ డాల్‌లాగా ఉన్న ఆమె.. ఇందులో నటిగా ప్రతిభ చాటుకుంది. తన కెరీర్లో ఇప్పటిదాకా ఇదే బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు.
ఇక ‘క’ మూవీలో రెండు లేడీ క్యారెక్టర్లు ఉన్నాయి. ఒక పాత్రను ‘ఆయ్’ ఫేమ్ నయన్ సారిక పోషించగా.. మరో పాత్రలో మలయాళ నటి తన్వి రామ్ కనిపించింది. ఇద్దరికీ కథలో కీలకమైన పాత్రలే దక్కాయి. వారి పాత్రలతోనే కథ మలుపు తిరుగుతుంది. ఇద్దరూ తమ పాత్రల్లో బాగానే ఒదిగిపోయారు. ఇద్దరికీ మంచి విజయమూ దక్కింది. ఇలా ఈ దీపావళి తెలుగు సినిమాలు కంటెంట్‌కే కాక హీరోయిన్ల స్పెషల్‌గానూ నిలిచాయి.