దీపావళికి ‘కంటెంట్’ యుద్ధం

తెలుగు రాష్ట్రాల్లో ఏ పెద్ద పండుగ వచ్చినా.. థియేటర్లలో సినిమాల సందడి బాగా ఉంటుంది. ఈ నెలలో రెండు పెద్ద పండుగల ఉండడంతో అందుకు తగ్గట్లే బాక్సాఫీస్ హంగామాకు ఢోకా లేకపోయింది. ఈ నెల రెండో వారంలో దసరా రావడంతో చాలా సినిమాలు బరిలోకి దిగాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ అనువాద చిత్రం ‘వేట్టయన్’తో పాటు విశ్వం, మా నాన్న సూపర్ హీరో, జనక అయితే గనక చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. కానీ వీటిలో ఏదీ ప్రేక్షకులను సంతృప్తి పరచలేకపోయింది.

వీక్ కంటెంట్‌తో అన్నీ నిరాశపరిచాయి. ఇప్పుడిక దీపావళి మీద అందరి దృష్టీ నిలిచింది. ఐతే ఈ పండక్కి రాబోతున్న సినిమాలన్నీ బలమైన కంటెంట్ ఉన్న వాటిలాగే కనిపిస్తున్నాయి. పెద్ద రేంజ్ సినిమాలు రిలీజ్ కావట్లేదనే కానీ.. ఉన్న వాటిలో అన్నీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నవే.

ముందుగా దుల్కర్ సల్మాన్ మూవీ ‘లక్కీ భాస్కర్’ విషయానికి వస్తే.. దీని టీజర్, ట్రైలర్ చాలా కొత్తగా అనిపించాయి. లవ్ స్టోరీలకు పేరుపడ్డ వెంకీ అట్లూరి ఈసారి కొత్త జానర్లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తీసినట్లున్నాడు. ‘స్కామ్ 1992’ను తలపించేలా చాలా ఇంటెన్స్‌గా కనిపించాయి దీని టీజర్, ట్రైలర్. దుల్కర్ లాంటి మంచి జడ్జిమెంట్ ఉన్న హీరో ఈ కథను ఓకే చేసి సినిమా చేశాడంటేనే ఇందులో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది.

ఇక వరుస డిజాస్టర్ల తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న ‘క’ మూవీ అదిరిపోయే టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ఈ సినిమా సంగతేంటో చూడాలనే క్యూరియాసిటీ ఆడియన్స్‌లో కలిగింది. దీనిపైనా అంచనాలు పెరిగాయి. ఇక అనువాద చిత్రాలు అమరన్, భగీర కూడా కూడా ట్రైలర్లతో ఆకట్టుకున్నాయి. అమరన్ ముకుంద్ అనే దివంగత ఆర్మీ ఆఫీసర్ బయోపిక్. దీని ప్రోమోలు కూడా బాగున్నాయి. సిన్సియర్ ఎఫర్ట్‌లా కనిపిస్తోంది. ఇక ‘భగీర’ ప్రశాంత్ నీల్ కథతో ‘కేజీఎఫ్’ను తలపిస్తోంది. మొత్తానికి దీపావళికి అన్నీ కంటెంట్ ఉన్న సినిమాల్లాగే కనిపిస్తున్నాయి. మరి ఈ కంటెంట్ యుద్ధంలో గెలిచేదెవరో?