పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఇవాళ మరో ప్యాన్ ఇండియా మూవీ రణమండల ప్రకటించింది. హీరో, దర్శకుడు తదితర వివరాలు పేర్కొనలేదు కానీ ఒక చిన్న పాపకు అభయమిస్తూ హనుమంతుడి పాదంని యానిమేషన్ రూపంలో రివీల్ చేశారు. అయితే ఈ పేరు వెనుక ఊహించి అల్లుకున్న ఫాంటసీ లేదు. వాస్తవమే ఉంది. అదేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలో ఆదోని అనే చిన్న పట్టణం కర్ణాటక సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. ఒకప్పుడు వాణిజ్య పరంగా దీన్ని సెకండ్ ముంబైగా పిలిచేవారు. అంత భారీ ఎత్తున పత్తి వ్యాపారంతో పాటు ఇతర బిజినెస్ లు జరిగేవి.
ఈ ఆదోని పొలిమేరలో ఎత్తయిన కొండల మీద ప్రతిష్టించిన దేవాలయమే రణమండల. ఆంజనేయస్వామి కొలువుంటాడు. శ్రావణ మాసంలో వేలాది భక్తులు వందలాది మెట్లు ఎక్కి రోజు దర్శించుకోవడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఎర్ర చందనం పూసిన స్వామి రాతి విగ్రహాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఎంతసేపైనా ఉండిపోవాలనిపించే ప్రశాంతత కొలువు తీరి ఉంటుంది. పీపుల్స్ మీడియా నిర్మాత టిజి విశ్వప్రసాద్ కు ఆదోని స్వంత ఊరు. ఆయన బాల్యం, చదువు ఇక్కడే జరిగాయి. అందుకే రణమండల మీద అవగాహన, అభిమానం ఎక్కువ.
ఈ కారణంగానే పోస్టర్ లాంచ్ ని విశ్వప్రసాదే స్వయంగా ఆదోని రణమండల కొండ మీద చేయించారు. హనుమాన్ ని మించి ఇందులో అద్భుతమైన కంటెంట్ చూడొచ్చని యూనిట్ టాక్. హీరో హీరోయిన్, సాంకేతిక వర్గం తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలతో దూసుకుపోతున్న పీపుల్స్ మీడియా వచ్చే ఏడాది ది రాజా సాబ్, మిరాయి అతి తక్కువ గ్యాప్ లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య వరస ఫెయిల్యూర్స్ పలకరించినప్పటికీ త్వరలోనే ధమాకాని మించే బ్లాక్ బస్టర్స్ తో తిరిగి ట్రాక్ లోకి వస్తామనే నమ్మకంతో ప్రాజెక్టులు సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.