క్లైమాక్స్ గురించి కిరణ్ అబ్బవరం శపథం

యూత్ హీరోలు తమ సినిమా మీద నమ్మకంతో ఒక్కోసారి పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చేస్తారు. కొన్నిసార్లు అవి నిజమైతే ఇంకొన్ని సందర్భాల్లో మిస్ ఫైరైన దాఖలాలు లేకపోలేదు. శ్రీవిష్ణు, విశ్వక్ సేన్ గతంలో అలా చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి కిరణ్ అబ్బవరం చేరాడు.

అక్టోబర్ 31 విడుదల కాబోతున్న ‘క’ ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ ట్రీట్ మెంట్, పాయింట్ చెప్పిన విధానం కొత్తగా అనిపించకపోయినా, ఇంతకు ముందు చూసినట్టు అనిపించినా ఇకపై నటించననే రీతిలో శపథం చేయడం మీడియా ప్రతినిధులకు షాక్ ఇచ్చింది.

నిజానికి ‘క’ మీద కిరణ్ ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్ గా ఉన్నాడంటే స్వంతంగా నిర్మాణంలో భాగం కావడంతో పాటు దీనికన్నా ముందు రిలీజ్ కావాల్సిన దిల్ రుబాని వాయిదా వేసుకునేంత. అందుకే పోటీ తీవ్రంగా ఉన్నా, తమిళనాడులో ఒక వారం ఆలస్యంగా విడుదల చేయాల్సి వచ్చినా రిస్క్ తీసుకోవడానికి సిద్ధ పడ్డాడు.

హైప్ మొన్నటి వరకు ఏమో కానీ ట్రైలర్ వచ్చాక లెక్కలు మారాయి. మిస్టిక్ థ్రిల్లర్ జానర్ లో ఏదో కొత్తగా ట్రై చేశారనే అభిప్రాయం కలిగించారు. దానికి తోడు ప్రొడక్షన్ వేల్యూస్ ఘనంగా ఉండటం, సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వగైరాలు అంచనాలు అమాంతం పెంచేశాయి.

ఇంతగా చెప్పాడంటే ‘క’లో మ్యాటర్ ఉన్నట్టు అర్థమవుతోంది. ప్రమోషన్ కంటెంట్ లో చూపించిన జాతర పాట క్లైమాక్స్ లో భాగంగా వచ్చేదే. రెండు మూడు హిట్లున్నప్పటికీ కెరీర్ పరంగా సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న కిరణ్ అబ్బవరంకు ‘క’ సక్సెస్ కావడం చాలా కీలకం.

పదే పదే కొత్త దర్శకులను నమ్మడం ఈసారి గురి తప్పదని చెబుతున్నాడు. పక్కవాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడాలనే తాపత్రయం ఉన్న ఓ కుర్ర పోస్ట్ మ్యాన్ దాని వల్ల ఎలాంటి చిక్కుల్లో పడ్డాడనే పాయింట్ మీద ‘క’ రూపొందింది. జంట స్వయం సుజిత్ – సందీప్ దర్శకత్వం వహించిన ‘క’కు లక్కీ భాస్కర్, అమరన్, బఘీరాలతో పోటీ ఉంది.