2025 సంక్రాంతికి ఏ సినిమాలు పక్కాగా వస్తాయనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేక బయ్యర్లు, సినీ ప్రియులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10 పక్కాగా రిలీజవుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ‘బాలయ్య 109’ ఓ రెండు రోజుల తర్వాత జనవరి 12 లాక్ చేసుకునే ఛాన్స్ ఉంది. నిర్మాత నాగవంశీ చూచాయగా ఈ విషయాన్నే చెబుతున్నారు. ఈ రెండు తప్ప ఎవరూ నొక్కి వక్కాణించి తమదీ వస్తుందని చెప్పడం లేదు. గేమ్ నిర్మిస్తున్న దిల్ రాజు నిర్మాణంలోనే రూపొందుతున్న ‘వెంకటేష్ – అనిల్ రావిపూడి’ చిత్రం బరిలో తప్పుకుందనే ప్రచారం ప్రస్తుతానికి గాసిప్పే.
నిజంగా రేస్ నుంచి బయటికి వెళ్లిందా లేదానేది ఇప్పట్లో చెప్పరు. సందీప్ కిషన్ ‘మజాకా’ను పండగ బరి కోసమే రెడీ చేస్తున్నారు. ఎంత పోటీ ఉన్నా సరే ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఉన్న తమ మూవీ మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందనే నమ్మకం దర్శకుడు త్రినాథరావు నక్కినలో కనిపిస్తోంది. అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వచ్చేది లేనిది హీరో మరో సినిమా విదాముయార్చి మీద ఆధారపడి ఉండటంతో మైత్రి డేట్ ని ఖరారు చేసుకోలేదు. తాజాగా ‘శర్వానంద్ – రామ్ అబ్బరాజు’ కాంబోలో తెరకెక్కుతున్న ఎంటర్ టైనర్ సైతం జనవరినే టార్గెట్ చేసుకుందనే వార్త ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కథ ఇక్కడితో అయిపోలేదు. తమిళ హిట్ గరుడన్ రీమేక్ ‘వామన’ను సైలెంట్ గా షూటింగ్ కానిస్తూ వీలైతే సంక్రాంతి కోసమే అనేలా వేగవంతం చేస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సో పండగ బాక్సాఫీస్ అంతులేని కథలా అలా పొడిగించుకుంటూ పోతోంది తప్ప వ్యవహారం కొలిక్కి వచ్చేలా లేదు. నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో అన్నట్టు ఈసారి మూడు సినిమాల కంటే ఎక్కువ రావనే మాట నిజం కాకపోవచ్చు అనిపిస్తోంది. ఎంత రిస్క్ అయినా పర్వాలేదంటూ మీడియం బడ్జెట్ చిత్రాలు సాహసానికి పూనుకోవడమే ట్విస్టు.