ఇద్దరు గజినిలు కలవడం ఎలా సాధ్యం

సూర్య కెరీర్ లో పాత్ బ్రేకింగ్ మూవీగా నిలిచిపోయిన గజిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 2005 తెలుగులో తనకు మార్కెట్ పెద్దగా లేని టైంలో ఒక్కసారిగా స్టార్ డం తీసుకొచ్చిన సినిమా ఇది. తమిళంలో రికార్డులు వెల్లువెత్తాయి. ఏఆర్ మురగదాస్ పేరు మారుమ్రోగిపోయింది. చిరంజీవి, మహేష్ బాబు లాంటి స్టార్లు పిలిచి మరీ ఆఫర్లు ఇచ్చారంటే దానికి గజినీ తప్ప వేరొకటి కారణం కాదు. అమీర్ ఖాన్ అంతటి వాడు ఇమేజ్ లెక్కలు పక్కనపెట్టి బాలీవుడ్ రీమేక్ చేస్తే అక్కడా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇరవై సంవత్సరాలు దాటుతున్నా గజినికి ఉన్న కల్ట్ స్టేటస్ చెక్కు చెదరలేదు.

అయితే ఎప్పటి నుంచో గజినికి కొనసాగింపు కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూనే వచ్చారు కానీ ఆ దిశగా ఎవరూ ఆలోచించలేదు. ఇటీవలే అమీర్ దీనికి సీక్వెల్ ఎవరైనా రాసుకొస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీడియా ముచ్చట్లలో చెప్పాడు. సల్మాన్ ఖాన్ సికందర్ షూటింగ్ లో బిజీగా ఉన్న మురుగదాస్ ఏం చేస్తాడో చూడాలి. అయితే మరి సూర్య సంగతేంటి అనే డౌట్ వస్తుంది కదూ. అక్కడికే వద్దాం. కంగువ ప్రమోషన్ల కోసం నార్త్ లో టూర్లు చేస్తున్న సూర్య భవిష్యత్తులో గజిని 2 ఉంటుందని, తనను అమీర్ ఖాన్ ను ఒకేసారి స్క్రీన్ మీద చూడొచ్చని చెప్పడం అభిమానులతో పాటు మీడియాకు షాక్ ఇచ్చింది.

ఎందుకంటే రెండు ఒకే కథతో రూపొందాయి. విలన్ కు సంబంధించిన ట్విస్టు తప్ప దాదాపు మొత్తం మక్కికి మక్కి ఉంటుంది. అలాంటప్పుడు ఇద్దరు గజినిలు ఎలా కలుస్తారంటే చెప్పలేం. వేరే కొత్త స్టోరీతో సూర్య, అమీర్ కలుసుకునేలా ఏదైనా మల్టీస్టారర్ రాసుకుని దానికి మతిమరుపు జబ్బు పెడితే తప్ప ఇది సాధ్యం కాదు. ఏదో మాట వరసకు అన్నారో లేక నిజంగా ఆ ఆలోచన ఉందో తెలియదు కానీ గజినిలో నటించిన క్యాస్టింగ్, పని చేసిన సాంకేతిక బృందం మొత్తం అందుబాటులోనే ఉన్నారు. ఇదేదో అమలు చేస్తే మాత్రం సరికొత్త బాక్సాఫీస్ సెన్సేషన్ కు దారి తీయడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.