విశ్వంభర.. మెగాస్టార్ చిరంజీవి కెరర్లోనే అత్యధిక బడ్జెట్లో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా మొదలు కావడంతో మొదట్నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. విశ్వంభర అనే టైటిల్ నుంచి అన్నీ పాజిటివ్‌గా కనిపించాయి ఈ సినిమాకు సంబంధించి.
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’తో పోలుస్తూ చిరు కెరీర్లోనే టాప్-5 సినిమాల్లో ఇది ఒకటిగా ఉంటుందని వశిష్ఠ చెప్పడంతో అభిమానులు అంచనాలను ఇంకా పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా టీజర్ వస్తోందంటే అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు.
టీజర్ సినిమాకున్న హైప్‌ను ఇంకా పెంచుతుందని ఆశించారు. తీరా చూస్తే టీజర్ వచ్చాక ‘విశ్వంభర’ పేరు బాగానే ట్రెండ్ అయింది కానీ.. అది నెగెటిావ్‌గా కావడం అభిమానులకు, మేకర్స్‌కు పెద్ద షాక్.
‘విశ్వంభర’ టీజర్లో చూపించిన వీఎఫెక్స్ క్వాలిటీ మెజారిటీ జనాలకు రుచించలేదు. మెగా అభిమానులేమో అంతా బాగుంది అని సర్దిచెప్పుకున్నా న్యూట్రల్ జనాలు విజువల్ ఎఫెక్ట్స్ మీద పెదవి విరిచారు. పైగా ‘ఇన్ఫినిటీ’, ‘అవతార్’ సహా పలు చిత్రాల నుంచి సన్నివేశాల విషయంలో స్ఫూర్తి పొందిన విషయం బయటపడిపోవడంతో సినిమాను నెటిజన్లు బాగా ట్రోల్ చేశారు.
దీనికి తోడు సినిమాటోగ్రఫీ కూడా అంత గొప్పగా అనిపించలేదు. మరోవైపు చిరు మేకప్, స్టైలింగ్ విషయంలో విమర్శలు వచ్చాయి. చిరు స్టైలింగ్ విషయంలో ఆయన తనయురాలు సుశ్మిత కొణిదెలను అభిమానులు విమర్శించడం ఇది తొలిసారి కాదు.
అన్నీ కలిపి ‘విశ్వంభర’ ఒక ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయింది. ఇంతకుముందు ‘ఆదిపురుష్’ విషయంలోనూ ఇదే జరిగింది. మొదట ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ టీజర్ రాగానే ఒక్కసారిగా నెగెటివిటీ ముసురుకుంది. ఎంత ప్రయత్నించినా ఆ నెగెటివిటీని తగ్గించలేకపోయారు.
ప్రేక్షకులు కూడా నెగెటివ్ దృష్టితోనే సినిమా చూశారు. తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. మరి ‘విశ్వంభర’ టీం ఇప్పుడు వస్తున్న ఫీడ్ బ్యాక్‌ను ఎలా తీసుకుని సర్దుబాట్లు చేసుకుంటుందో చూడాలి. ఎలాగూ సంక్రాంతికి సినిమా రావడం లేదు. వేసవికి వాయిదా పడింది. కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ మీద దృష్టిపెట్టి క్వాలిటీ పెంచడానికి ప్రయత్నిస్తే మంచిది.