సూపర్ స్టార్ రజినీకాంత్‌ను ఆయన అభిమానులు ఎంతగా అభిమానిస్తారో, ఆరాధిస్తారో తెలిసిందే. ఐతే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే కాక..వివాదాలకు దూరంగా ఉంటూ.. సున్నితంగా మాట్లాడే రజినీని ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో గౌరవిస్తుంటారు. ఆయన్ని నో నెగెటివిటీ స్టార్‌గా చెప్పొచ్చు.
కానీ సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి హీరో మీద కూడా అదే పనిగా నెగెటివ్ ట్రెండ్ చేసే పరిస్థితులు వచ్చేశాయి. సూపర్ స్టార్ తాజాగా వేట్టయన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. జై భీమ్ లాంటి గొప్ప సినిమా తీసిన టీజీ జ్ఞానవేల్ రూపొందించిన చిత్రమిది.
జై భీమ్ తరహాలోనే మరోసారి సామాజిక అంశాలతో కథను అల్లుకున్నాడు జ్ఞానవేల్. రజినీ కూడా తన ఇమేజ్‌ను పక్కన పెట్టి విభిన్నమైన ప్రయత్నం చేశాడు. ఐతే సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కానీ ఇది తీసి పడేయదగ్గ మూవీ అయితే కాదు.
ఐతే సినిమా నచ్చకపోతే బాలేదు అని చెప్పాలి కానీ.. అదే పనిగా సోషల్ మీడియాలో దాన్ని ట్రోల్ చేయడం, నెగెటివ్ ట్రెండ్ చేయడమే విడ్డూరం. వేట్టయన్ సినిమా చూసి తాము మానసిక ప్రశాంతత కోల్పోయామని.. టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఒక రోజంతా నెగెటివ్ ట్రెండ్ చేశారు. Refundvettaiynticketmoney అనే హ్యాష్ ట్యాగ్ నిన్న ఇండియా లెవెల్లో ట్రెండ్ అయింది. ఈ హ్యాష్ ట్యాగ్ మీద దారుణమైన పోస్టులు పెట్టారు.
రజినీని కించపరిచే ప్రయత్నం చేశారు. ఇది ప్రస్తుతం తమిళంలో నంబర్ వన్ హీరో అనదగ్గ విజయ్ అభిమానుల పనే అని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా తమిళంలో విజయ్ హవా నడుస్తోంది. బాక్సాఫీస్ లెక్కల్లో రజినీని విజయ్ అధిగమించేశాడు. కానీ రజినీ అభిమానులు ఈ విషయాన్ని అంగీకరించరు.
వారితో విజయ్ అభిమానులకు గొడవ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే విజయ్ ఫ్యాన్స్ రజినీ సినిమా మీద నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి రజినీని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఐతే రజినీ లాంటి హీరో మీద కూడా ఇంత నెగెటివిటీ చూపించడం చూస్తే.. సోషల్ మీడియా దుష్పరిణామాలు ఎలాంటివో అర్థమవుతుంది.