అక్కడ సైబర్ నేరాలకు కోచింగ్ సెంటర్లు ఓపెన్ చేశారట

నేరాలు చేసే తీరు మారిపోయింది. కాలు బయటకు పెట్టకుండా.. నిఘా నేత్రం నుంచి తప్పించుకొని.. దొంగతనం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రజల బలహానత.. అత్యాశలే పెట్టుబడిగా చేసుకొని వారిని తెలివిగా బోల్తా కొట్టించి.. వారి నుంచి పెద్ద ఎత్తున దోచుకునే సైబర్ నేరగాళ్లు ఎక్కువ అయిపోతున్నారు. కంటికి కనిపించని ఈ నయా నేరస్తుల పుణ్యమా అని.. సైబర్ నేరాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.


టెక్నాలజీ మీద అవగాహన లేని కొందరి బలహీనత కూడా డబ్బులు పోగొట్టుకోవటానికి కారణమవుతోంది. అదే సమయంలో.. ఊరించే ప్రకటనల మాయలో పడటమే తప్పించి.. ట్రాప్ చేస్తున్న వైనాన్ని గుర్తించని తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సైబర్ నేరాలు అంతకంతకూ ఎక్కువ కావటం.. ఈ నేరస్తుల్ని పట్టుకునే విషయంలో ఎదురవుతున్న సవాళ్లతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

ఈ విషయాన్ని గుర్తించిన కొన్ని రాష్ట్రాల్లోని నేర ముఠాలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. సైబర్ నేరాలకు ఎలా పాల్పడాలి? ఎలా తప్పించుకోవాలి? ఎలా పోలీసులకు చిక్కకూడదు? నేరం చేసే వేళ.. బాధితుల్ని ఎలా బోల్తా కొట్టించాలి? వారి నుంచి సొమ్ములు ఎలా లాగేసుకోవాలి? లాంటి ఎన్నో విషయాలకు సంబంధించి కోచింగ్ ఇస్తూ.. సెంటర్లు నిర్వహిస్తున్న వైనాన్ని తాజాగా రాచకొండ పోలీసులు బయటపెట్టారు. పదహారుకేసుల్లో నిందితులుగా ఉన్న పది మంది దేవగఢ్ ముఠా సభ్యుల్ని రాచకొండ పోలీసులు నగరానికి తీసుకొచ్చారు. రిమాండ్ కు తరలించారు.

ఈ సందర్భంగా దర్యాప్తు టీంకు వచ్చిన సమాచారం అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. దేవగఢ్ జిల్లాలోని అనేక గ్రామాల్లో దాదాపు ఇంటికో సైబర్ నేరస్తుడు ఉన్నాడని పోలీసుల విచారణలో తేలింది. కొందరు తల్లిదండ్రులు కూడా అలాంటి నేరాలకు ప్రోత్సాహిస్తున్న వైనం తెలిసి షాక్ కు గురైనట్లుగా పోలీసులు చెబుతున్నారు. వీరంతా ఒక పార్టీకి క్రియాశీలక కార్యకర్తలుగా పని చేస్తున్న వైనాన్ని గుర్తించారు.

పొరుగన ఉన్న పశ్చిమబెంగాల్ నుంచి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఒకేసారి 500 సిమ్ కార్డుల్ని తెచ్చుకొంటున్నారని.. ఒక నేరం చేసినంతనే వెంటనే ఆ సిమ్ ను పక్కన పెట్టేస్తున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. స్థానిక పోలీసులు సైతం మోసగాళ్లకు కొంతమేర సహకరిస్తున్న వైనం బయటకు వచ్చింది. ఈ సైబర్ ముఠాలో 20 మంది చొప్పున ఉంటారని భావించినా.. వాస్తవానికి నలుగురే ఉంటున్నారని. ఇద్దరు కంప్యూటర్లను ఆపరేట్ చేస్తారని.. మరో ఇద్దరు ఫోన్ల ద్వారా అమాయకులను బోల్తా కొట్టిస్తారని చెబుతున్నారు.

ఒక్కో ముఠా వద్ద వందకు పైగా బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటాయని.. బ్యాంకులో డబ్బులు పడిన వెంటనే వేర్వేరు ఖాతాలకు తరలించటం.. ఏటీఎం కార్డులు ఇచ్చి విత్ డ్రా చేసుకోవటం లాంటివి చేస్తున్నారని గుర్తించారు. విత్ డ్రా చేసిన మొత్తానికి పదిశాతం కమిషన్ ను విత్ డ్రా చేసుకొచ్చిన వారికి ఇస్తున్న వైనాన్ని గుర్తించారు. ఇలా షాకింగ్ అంశాలు ఎన్నింటినో రాచకొండ పోలీసులు గుర్తించారు.