విశాఖ గ్యాస్ లీక్.. గుండెలు పిండే ఒక స్టోరీ

ఆ పిల్లాడి వయసు అయిదేళ్లు. అతడి తండ్రి ఓ కూలీ. అతను ఒక్క రోజు ముందే చనిపోయాడు. కానీ తన తండ్రిని చివరి చూపు చూసుకునే అవకాశం ఆ పిల్లాడికి లేకపోయింది. కళ్లు తెరవలేని పరిస్థితిలో అతను అల్లాడుతున్నాడు పాపం. విశాఖపట్నం గ్యాస్ లీక్ ఉదంతం వల్ల తలెత్తిన విషాద దృశ్యమిది. ఈ విషాదం గురించి వివరాలు తెలుసుకున్న ఎవ్వరికైనా కన్నీళ్లు రాక మానవు.

రెండు రోజుల కిందట ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన విష వాయువు కారణంగా పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అందులో గోవింద రాజు అనే 40 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. అతను ఎల్జీ పాలిమర్స్ సంస్థలోనే కూలీగా పని చేస్తున్నాడు. అతను స్టెరీన్ గ్యాస్‌ను పీల్చి ప్రాణాలు కోల్పోయాడు. కొన్ని రోజుల కిందటే ఫ్యాక్టరీ పున:ప్రారంభమైన నేపథ్యంలో అతను అక్కడ పని కోసం వెళ్లినట్లున్నాడు.

ప్రమాదవశాత్తూ గ్యాస్ లీక్ కావడం, పరిశ్రమలోనే ఉండి దాన్ని పీల్చడంతో గోవిందరాజు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం ముందు కుటుంబ సభ్యులకు తెలియలేదు. పత్రికల్లో వచ్చిన ఫొటోను చూసి మరుసటి రోజు కేజీహెచ్‌లోని మార్చురీకి వచ్చిన కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఇదిలా ఉండగా ఫ్యాక్టరీకి సమీపంలోనే వీరి ఇల్లు ఉంది. గోవిందరాజు కొడుకు మణిదీప్ విష వాయువును పీల్చడం వల్ల అస్వస్థతకు గురయ్యాడు.

ఈ గ్యాస్ ప్రభావం కంటి చూపు మీద కూడా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మణిదీప్ నిన్నట్నుంచి కళ్లు తెరిచే పరిస్థితి లేదు. కళ్లు తెరవాలని ప్రయత్నించినా కుదర్లేదు. శుక్రవారం గోవిందరాజుకు అంత్యక్రియలు జరిపించగా.. కళ్లు తెరవలేకపోవడం వల్ల మణిదీప్ తన తండ్రిని చివరిసారిగా చూసుకునే అవకాశం లేకపోయింది. ఈ పిల్లాడికి చికిత్స అందించేందుకు నేత్ర వైద్య నిపుణుల్ని రప్పిస్తున్నట్లు కేజీహెచ్ వైద్యాధికారులు తెలిపారు.