ఇక చెక్ బుక్‌లకు చెల్లు?

ఇక చెక్ బుక్‌లకు చెల్లు?

కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది. దేశంలో డిజిటల్‌ లావాదేవీలకు ఊతమివ్వడంలో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సర్కారు చెక్‌ బుక్కులకు మంగ‌లం పాడేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.  ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు నగదు రహిత భారతమే చక్కని పరిష్కారమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బలంగా విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే నిరుడు నవంబర్‌ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు స్వయంగాఆయనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మక మార్పులకూ శ్రీకారం చుట్టారు. దీంతో క్రమేణా కార్డు లావాదేవీలు పెరుగగా, నగదుకు ప్రాధాన్యం లేకుండాపోయింది.

ఈ దూకుడుకు కొన‌సాగింపుగా...ఇప్పుడు డిజిటల్‌ లావాదేవీలను మరింత బలోపేతం చేయడానికి చెక్కులకూ చెక్‌ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా త్వరలో బ్యాంక్‌ చెక్‌ బుక్కులకు కేంద్రం గుడ్‌బై చెప్పనుందని ఇటీవల అఖిల భారత వర్తకుల సమాఖ్య (సిఏఐటీ) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ చెప్పారు. దీనివల్ల డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వినియోగం పుంజుకుంటుందనే భావన ప్రభుత్వంలో సర్వత్రా వ్యక్తమవుతున్నదన్నారు. కాగా, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని చాలామందికి అసౌకర్యం కలిగించింది. నిరుపేద కార్మికుల నుంచి బడా పారిశ్రామికవేత్తలదాకా అంతా ప్రభావితులయ్యారు. ఇప్పుడు చెక్‌ బుక్కులను రద్దు చేస్తే దాని ప్రభావం కూడా తీవ్రంగానే ఉండనుంది.

దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాపార లావాదేవీల్లో చెక్కుల ద్వారా జరిగేవే ఎక్కువ. ప్రస్తుత లావాదేవీల్లో 95 శాతం నగదు, చెక్కుల ద్వారానే జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలు పడిపోయిన నేపథ్యంలో చెక్కుల వినియోగం పెరిగిందని అంటున్నారు. దీంతో చెక్‌ బుక్కుల నిషేధం ప్రభావం అధికంగానే ఉంటుందన్న అభిప్రాయాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల (ఎస్‌ఎంఈ) చెల్లింపుల్లో చెక్కులదే అధిక వాటా. వస్తువుల డెలివరీ, సరఫరాలు.. చిరువ్యాపారులు, కస్టమర్లిచ్చే చెక్కులపైనే ఆధారపడి ఉంటాయి. కావాల్సిన తేదీకి చెల్లుబాటు అయ్యే వెసులుబాటు చెక్కుల్లో ఉండటంతో నూతన లావాదేవీల్లో వీటినే ఎక్కువగా వాడుతున్నారు. సరుకు అందనిపక్షంలో చెక్కులను నిలుపుదల చేసుకునే వీలు కూడా ఉంటుంది. ఇక రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ చెక్కులకు డిమాండ్‌ ఎక్కువే. భూములు, ఇళ్ల‌ క్రయవిక్రయాల్లో అధికులు చెక్కులకే ప్రాధాన్యతనిస్తున్నారు. చాలామంది అద్దెలనూ చెక్కుల ద్వారానే తీసుకుంటున్నారు. పెద్ద నోట్లు రద్దయిన దగ్గర్నుంచి భీమ్‌ వంటి ఎన్నో పేమెంట్‌ యాప్‌లు వచ్చినా.. చెక్కులకు మాత్రం ఆదరణ తగ్గలేదు. నగదు, కార్డు లావాదేవీల కంటే భారీ చెల్లింపులకు చెక్కులే శ్రేయస్కరమని మెజార్టీ ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు