చంద్రబాబుకు భద్రతకు 750మంది..!

చంద్రబాబుకు భద్రతకు 750మంది..!

మావోయిస్టుల ఆత్మాహుతి దాడుల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మునుపెన్నడూ లేనిస్థాయిలో భద్రత కల్పించారు. శనివారం కర్నూలులో సీఎం పాల్గొంటున్న పాదయాత్రకు పోలీసులు అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. చంద్రబాబు రక్షణ కోసం సుమారు 600 మంది పోలీసులు, 150 మందితో కూడిన సాయుధ రక్షక సభ్యులు భద్రత కల్పిస్తున్నారు.

చంద్రబాబు పాదయాత్ర కర్నూలులో సుమారు 3 కిలోమీటర్ల మేర సాగనుంది. అనంతరం కోల్స్ కళాశాల మైదానంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్యయాత్ర సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో రెండు డ్రోన్ కెమెరాలు, సుమారు 150 సిసి కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించనున్నారు. కంట్రోల్ రూంలో ఇద్దరు డీఎస్పీలను నియమించి అనుక్షణం తగిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేసేలా చర్యలు తీసుకున్నారు.

చంద్రబాబు పాదయాత్ర నిర్వహించే రహదారులతో పాటు అటు ఇటూ సుమారు అర కిలోమీటర్ పరిధిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసు జాగిలాలు, బాంబు డిస్ఫ్యూజింగ్ స్క్వాడ్  రహదారుల వెంట పర్యటించి తనిఖీలు చేశాయి. సిఎం జన చైతన్యయాత్రలోనే కాకుండా ప్రభుత్వ కార్యక్రమమైన పొదుపు సంఘాల మహిళలకు రెండవ విడత పెట్టుబడి నిధి పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటుండటంతో రెండు సభలకు హాజరయ్యే ప్రజలను పూర్తిస్థాయిలో పరిశీలించి అనుమతించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు