మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ ‘ప్ర‌జాగ‌ళం’లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో ఉండ‌డంతో ఈ స‌భ‌కు రాలేదు. అయితే.. ఈ స‌భ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల్గొన్నారు. మ‌రి కూట‌మి పార్టీల కీల‌క నేత లేక‌పోతే..ఎలా అనుకున్నారా? ఇక్క‌డే నారా లోకేష్ ఆ భ‌ర్తీ పూర్తి చేశారు. ఈ రాజ‌మండ్రి స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నారా లోకేష్ మాత్ర‌మే పాల్గొన్నారు.ఇక‌, మోడీ సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు. అయితే.. సాధార‌ణంగా మోడీ స‌భ‌ల్లో చంద్ర‌బాబు పాల్గొంటేనే ఆ రంజు వేరుగా ఉంటుందని అంద‌రూ అనుకుంటారు.

అయితే.. ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా.. చంద్ర‌బాబు మాదిరిగానే ప్ర‌సంగించి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ముగ్ధుడిని చేశారు. ప్ర‌తి వాక్యంలోనూ.. ప్ర‌త్యేక‌త క‌న‌బ‌రిచారు. మోడీని పొగ‌డ్త‌ల‌తోనే కాదు.. ఆయ‌న‌కు న‌చ్చిన‌ట్టుగా కూడా మాట్లాడారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. బీజేపీ నేత‌లు కూడా ఆ రేంజ్లో ప్ర‌సంగించ‌రేమో.. అన్న‌ట్టుగా నారా లోకేష్ ప్ర‌సంగించారు. ఇది ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్ర‌సంగాల్లోనే హైలెట్‌గా నిలిచింద‌ని చెప్పాలి. మోడీకి అన‌కాప‌ల్లి, రాజ‌మండ్రి మిఠాయిలు రుచి చూపిస్తున్నాం.. అంటూ.. సుమారు 5 కిలోల విభిన్న మిఠాయిలు పంపించారు.

ఇక‌, న‌మో(NAMO) అనే నాలుగు అక్ష‌రాలు దేశాన్ని న‌డిపిస్తున్నాయ‌ని నారా లోకేష్ అన‌గానే.. ప్ర‌ధాని ముఖం.. క‌మ‌లం పువ్వు మాదిరిగా విక‌సించింది. ప్ర‌ధానిని విశ్వ‌జిత్‌( విశ్వ‌విజేత అని అర్థం) అని ప్ర‌శంసించిన‌ప్పుడు.. ప్ర‌ధాని న‌వ్వు ఆపుకోలేక పోయారు. ఆయ‌నే చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగించారు. హృద‌య పూర్వ‌క న‌మ‌స్కారాలు అని నారా లోకేష్ అన‌గానే.. ప్ర‌ధాని కూడా ప్ర‌తిన‌మ‌స్కారం చేశారు. ఇవాళ ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందంటే అందుకు కారణం మోడీనే అని అన్న‌ప్పుడు.. అంద‌రూ.. నారా లోకేష్ వైపు చూశారు. ప్ర‌ధాని అయితే.. అలా ఒక్క నిమిషం పాటు చూస్తుండి పోయారు.

“మోడీ గారికి మన ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా రుచి చూపించాలి” అంటూ.. వాటివైపు చూపించారు. అప్ప‌టికే స‌భా వేదిక‌పై స్వీట్ల‌ను సిద్ధం చేశారు. కానీ, ప్ర‌ధాని వాటిని ముట్టుకోలేదు. చేయి ఊపి ఆనందించారు. “న‌మో అనే నాలుగు అక్షరాలు దేశం దశ దిశ మార్చాయి” అని నారా లోకేష్ అన్న‌ప్పుడు.. ప్ర‌ధాని ముసిముసిగా న‌వ్వుకున్నారు. భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మోడీ అని నారా లోకేష్ కొనియాడిన‌ప్పుడు కూడా.. మోడీ అదేవిధంగా స్పందించారు. “మోడీ భారతదేశానికి గర్వకారణం… మోడీ నవభారత నిర్మాత” అని నారా లోకేష్ అన్న‌ప్పుడు ప్ర‌ధాని మ‌రింత సంతోషం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.