కిర‌ణ్‌కు రాజంపేట రాజ‌భోగ‌మేనా?

ఉమ్మడి ఏపీ ఆఖ‌రి ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి.. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న విష‌యం తెలి సిందే. అంతేకాదు.. తాజాగా జ‌రుగుతున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఆయ‌న ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని రాజం పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కూట‌మి అభ్య‌ర్థిగా బీజేపీ త‌ర‌ఫున ఆయ‌న బ‌రిలో నిలిచా రు. మ‌రి కిర‌ణ్ ప‌రిస్థితి ఏంటి?  ఆయ‌నును ఇక్క‌డ నుంచి ప్ర‌జ‌లు పార్ల‌మెంటుకు పంపిస్తారా?  ఎదుర‌వు తున్న చిక్కులు ఎన్ని?  స్వాగ‌తిస్తున్న సానుకూల‌త‌లెన్ని? అనేది ఆస‌క్తిగా మారింది.

ముందు ప్ల‌స్‌ల గురించి మాట్లాడుతే.. రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం కొంత భాగంగా చిత్తూరులోకి వ‌స్తుంది. సో.. ఇది ఆయ‌నకు సొంత గూడే. కాబ‌ట్టి ప్ర‌త్యేకంగా త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇక‌, రెడ్డి సామాజిక వ‌ర్గంలో కిర‌ణ‌కు ఒక వ‌ర్గం.. ఫాలోయింగ్ బాగానే ఉంది. గ‌తంలో ఆయ‌న సీఎంగా ఉన్న‌ప్పుడు మేళ్లు పొందిన వారు ఇప్పుడు ఆయ‌న‌కు సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. స్థానిక సమ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న ఉండ‌డం మ‌రో క‌లిసి వ‌స్తున్న అంశం.

ఇప్పుడు మైన‌స్‌ల గురించి మాట్లాడితే.. వీటి వాశి.. రాశి కూడా.. ఎక్కువ‌గానే ఉంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత .. ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌పై ఏనాడూ గ‌ళం వినిపించింది లేక‌పోవ‌డం.. కిర‌ణ్‌కు ఇబ్బందిగా మారింది. 28 శాతం మైనారిటీ ముస్లిం ఓటు బ్యాంకు ఉన్న రాజంపేట‌లో వారిని త‌న‌వైపు అనుకూలంగా మార్చుకోవ‌డం అంత ఈజీకాదు. పైగా.. కాంగ్రెస్ పార్టీలో ప‌ద‌వులు అనుభ‌వించి.. ముఖ్య‌మంత్రిగా చేసి.. ఇప్పుడు బీజేపీ వైపు వెళ్ల‌డాన్ని ఆయ‌న వ‌ర్గం కొంత వ్య‌తిరేక‌త‌తోనే చూస్తోంది.

పుంగ‌నూరు స‌హా రాజంపేట వంటి బ‌ల‌మైన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి వీటిలో పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి హ‌వా మామూలుగా లేదు. కుటుంబం మొత్తంగా ఇక్క‌డ వాలిపోయింది. దీనిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం అంత ఈజీయేనా? అనేది కిర‌ణ్‌కు ప్ర‌శ్న‌. ఇక‌, రాజంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌నూ వైసీపీ గత ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసింది. అంటే.. మొత్తంగా పార్టీ బ‌లంగా ఉంది. ఇక‌, బీజేపీ ప‌రంగా చూస్తే.. రాజంపేట జెండామోసేవారు పెద్ద‌గా లేరు. 2019లో పురందేశ్వ‌రి ఇక్క‌డ పోటీ చేసి ఓడిపోయారు. కూట‌మి ఇప్పుడు హ‌వాలో ఉంది కాబ‌ట్టి.. ఇది కిర‌ణ్‌కు ఏమేర‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌నేది చూడాలి.