టీడీపీ చేయాల్సిన వీడియోలు జనసేన చేస్తోంది!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓ వైపు మీడియా..మరోవైపు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఇలా తమ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని ఇరుకున పడేసేలా వీడియోలు చేయడంలో టీడీపీ కాస్త వెనుకబడి ఉంటే…టీడీపీ చేయాల్సిన పనిని జనసేన చేస్తోంది అన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే నట శేఖర కృష్ణ గతంలో అన్న ఎన్టీఆర్ గురించి మాట్లాడిన మాటల వీడియోను జనసేన షేర్ చేయగా అది వైరల్ గా మారింది.

నందమూరి తారకరామారావు గారు టీడీపీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న హీరో కృష్ణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని, కానీ, జగన్ మాత్రం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీల సంస్థపై కక్ష గట్టడంతో అది తెలంగాణకు తరలిపోయిందని విమర్శిస్తూ జనసేన ఎక్స్ లో పెట్టిన వీడియో వైరల్ గా మారింది. అన్నగారి వంటి నేతలు చేసిన హుందా రాజకీయాల నుండి నేర్చుకోవాల్సింది పోయి గల్లా వంటి వారి కుటుంబాలపై కక్ష కట్టాడు జగన్ అంటూ జనసేన విమర్శించింది. ఇటువంటి ఎన్నో నీతిమాలిన పనులు చేసిన జగన్ ను తరిమేయాల్సిన బాధ్యత కేవలం కృష్ణ, ఎన్టీఆర్ గారి అభిమానులపైనే కాదు, ప్రతీ సినీ హీరో అభిమానిపై ఉందని జనసేన ఎక్స్ లో ట్వీట్ చేసింది.

ఆ వీడియోలో కృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ తో తనకు ఇబ్బంది లేదని, ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్ హౌస్ లో నుంచి వస్తుండగా ఎన్టీఆర్ ఎదురుపడ్డారని కృష్ణ గుర్తు చేసుకున్నారు. ఎలా ఉన్నారు..మా మీద ఇంకా సినిమాలు తీస్తున్నారా అని సరదాగా ప్రశ్నించారని చెప్పారు. ఇప్పుడే తీయడం లేదు అని తాను సమాధానమిచ్చానని, ఆయన చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారని అన్నారు. అంతేకాదు, రెండోసారి సీఎం అయిన తర్వాత ఇంటికి భోజనానికి కూడా పిలిచారని గుర్తు చేసుకున్నారు.

ఇక, ఏపీ సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నంగా టీడీపీ నేతల వ్యాపారాలపై కక్షగట్టారని జనసేన విమర్శించింది. టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థను జగన్ టార్గెట్ చేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆ కోవలోనే ఆ కంపెనీకి విద్యుత్ సరఫరా ఆపివేయడం, సంస్థ విస్తరణ పనులకు ఆటంకాలు కలిగించడం, పర్యావరణానికి హాని కలిగిస్తోందంటూ సంస్థపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేయడం వంటి చర్యలతో ఆ కంపెనీని ఇబ్బందిపెట్టింది. దీంతో, ఆ కంపెనీ విస్తరణ పనులు ఆపేయడమే కాకుండా…అది తెలంగాణకు తరలిపోయింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 483 ఎకరాలు ఇస్తే 253 ఎకరాలు వెనక్కు తీసుకంది. 9500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలోని మహబూబ్ నగర్ లో ఆ సంస్థ నెలకొల్పేందుకు పనులు మొదలుబెట్టింది.