పవన్ అభిమానులు లేకపోతే చిరు సినిమాలు ఆడవట

మెగాస్టార్ చిరంజీవి ఓపెన్‌గా జనసేనకు, అలాగే ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించడం వైసీపీ వాళ్లకు అస్సలు రుచిస్తున్నట్లు లేరు. ఒక టైంలో చిరు.. ఏపీ సీఎం జగన్‌తో సన్నిహితంగా మెలిగారు. వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు కూడా మద్దతు పలికారు.

ఆ టైంలో చిరు, వేరు పవన్ వేరు అని.. తమ్ముడికి అన్న మద్దతు వేరని వైసీపీ వాళ్లు ప్రచారం చేశారు. కానీ ఇటీవల చిరు జనసేనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. అలాగే ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపు కూడా ఇస్తున్నారు. దీంతో చిరు మీద వైసీపీ తీవ్ర స్థాయిలో మాటల దాడి చేస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహా ప్రముఖ నేతలు చిరును టార్గెట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే భీమవరం సిట్లింగ్ ఎమ్మెల్యే, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి అయిన గ్రంథి శ్రీనివాస్ చిరు మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరు పక్కా కమర్షియల్ అని.. తన సినిమాల మనుగడ కోసమే పవన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గ్రంథి శ్రీనివాస్ విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చారు.

చిరు టికెట్ల రేట్ల వ్యవహారం మీద సీఎం జగన్‌ను కలిసినపుడు ఆయన నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయలేదని గొడవ చేశారని.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చిరు సినిమా చూడొద్దని అభిమానులకు పిలుపునిచ్చాడని.. దీంతో చిరు తర్వాతి సినిమాకు మినిమం ఓపెనింగ్స్ రాలేదని.. ఒక చిత్రమైన థియరీని వివరించారు గ్రంథి శ్రీనివాస్.

చిరు పక్కా కమర్షియల్ అన్న సంగతి అందరికీ తెలిసిందే అని.. దీంతో పవన్ ప్రాపకం కోసమే చిరు జనసేకు ఐదు కోట్ల ఫండ్ ఇచ్చాడని.. తన కొత్త చిత్రం ‘విశ్వంభర’ ఇంకో ఐదారు నెలల్లో రిలీజవుతుందని.. అప్పుడు ఆ సినిమాకు పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్ట్ కావాలని, వాళ్లు లేకుండా తన సినిమాలు ఆడవన్న ఉద్దేశంతోనే తమ్ముడికి మద్దతుగా మాట్లాడుతూ.. ఎలక్షన్ ఫండ్ ఇచ్చారని గ్రంథి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.