రెడ్డి ఉద్య‌మ నాయ‌కుడిగా కాపు ఉద్య‌మ నాయ‌కుడు

ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం ప్రారంభ‌మైంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో జోరుగా ఉన్న వైసీపీ, టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి నాయ‌కులు మాట‌ల‌కు ప‌దును పెంచుతున్నారు. ముఖ్యంగా జ‌న‌సేన త‌ర‌ఫున స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఉన్న‌వారు స‌వాళ్లు కూడా రువ్వుతున్నారు. దీంతో ఎన్నిక‌ల‌కు 20 రోజుల ముందుగానే.. రాష్ట్రంలో రాజ‌కీయం కాకెక్కింది. కేక‌పుట్టిస్తోంది. తాజాగా 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, టాలీవుడ్ న‌టుడు.. పృథ్వీ రాజ్‌.. జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, స‌వాళ్లు విసిరారు. అది కూడా.. కాపు ఉద్య‌మనాయ‌కుడు, ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కేంద్రంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాపు ఉద్య‌మ నాయ‌కుడిగా ప్ర‌స్థానం ప్రారంభించిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. ఇప్పుడు రెడ్డి ఉద్య‌మ నాయ‌కుడిగా.. రెడ్డి సేవ‌కుడి గా మారిపోయార‌ని దుయ్య‌బ‌ట్టారు. కిర్లంపూడిలో కూర్చుని క‌బుర్లు చెబుతున్న ముద్ర‌గ‌డ‌.. త‌న ప‌రిశ్ర‌మ‌ల‌కు, రైస్ మిల్లుల‌కు ఉన్న విద్యుత్ బ‌కాయిలు ఎంతో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులు ఎగ్గొడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఉత్త‌రాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ మూడు సీట్లు కూడా గెలిచే ప‌రిస్థితి లేద‌న్నారు. ఒక‌వేళ మూడు సీట్లు వైసీపీ గెలిస్తే.. తాను ముద్ర‌గ‌డ ఇంట్లో అంట్లు తోముతాన‌ని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ముద్ర‌గ‌డను ఇప్పుడు ప‌ట్టించుకునేవారు.. న‌మ్మేవారు కూడా ఎవ‌రూ లేర‌ని పృథ్వీ వ్యాఖ్యానించారు. మెగా కుటుంబంలో చిరంజీవి, రామ్‌చరణ్ స‌హా ప‌లువురు కూటమికి మద్దతుగా ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లోనే వ‌స్తార‌ని చెప్పారు. ఇక‌, సీఎం జ‌గ‌న్‌పై పృథ్వీ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌నను జ‌గ‌న్ రెడ్డి.. జ‌గ‌న్ రెడ్డి.. అంటారేంటి? ఆయ‌న జ‌గ‌న్ రెడ్డి కాదు.. `జ‌గ‌న్ బ‌ట‌న్ రెడ్డి`.. ఇది నేను చెబుతున్న మాట కాదు.. వైసీపీ నాయ‌కులే చెబుతున్నారు అని పృథ్వీ స‌టైర్లు వేశారు. అయితే.. దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.