సమీక్ష – ఆ ఒక్కటి అడక్కు

2/5

2 Hr 14 Mins   |   Comedy   |   03-05-2024


Cast - Allari Naresh, Faria Abdullah, Vennela Kishore, Harsha Chemudu and others

Director - Malli Ankam

Producer - Rajiv Chilaka

Banner - Chilaka Productions

Music - Gopi Sundar

గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం, తనను సరైన రీతిలో వాడుకునే టీమ్ దొరక్కపోవడం వల్ల మహర్షి నుంచి సీరియస్ పాత్రలకు షిఫ్ట్ అయిపోయాడు. ఒక దశ దాటాక ఇక్కడా మిశ్రమ ఫలితాలు రావడం మొదలయ్యింది. అందుకే తన పాత స్కూలుకు వచ్చేసి ఆ ఒక్కటి అడక్కు చేశాడు. తండ్రి ఈవీవీ సత్యనారాయణ, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కలిసి సృష్టించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ టైటిల్ ని వాడుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి న్యాయం జరిగిందా.

కథ

రిజిస్టర్ ఆఫీసులో పని చేసే గణపతి(అల్లరి నరేష్) కుటుంబం కోసం త్యాగాలు చేయడం వల్ల ముందు తమ్ముడికి పెళ్లయి తను మాత్రం బ్రహ్మచారిగా ఇంకా సంబంధాలు చూస్తుంటాడు. ఓ మాట్రిమోనీ సంస్థను కలిసి దాని ద్వారా సిద్ది (ఫరియా అబ్దుల్లా)ని కలుస్తాడు. ఇతనికి ఇష్టం ఉన్నా బయటికి చెప్పని కారణాల వల్ల ఆమె నో చెబుతుంది. ఇంకోవైపు గణ స్నేహితుడి చెల్లెలి కుటుంబంలో అలజడి రేగితే దాన్ని తీర్చే బాధ్యత గణ తీసుకుంటాడు. వెళ్లిపోయిందనుకున్న సిద్ది తిరిగి ఇతని జీవితంలో వస్తుంది. రకరకాల పరిణామాల తర్వాత గణ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఇదంతా ఎలా జరిగింది, ఏమైంది, పెళ్లి చేసుకున్నాడా లాంటి ప్రశ్నలు తెరమీదే చూడాలి

విశ్లేషణ

హాస్య ప్రియులు ఆ ఒక్కటి అడక్కు టైటిల్ చూడగానే బోలెడంత ఎంటర్ టైన్మెంట్ ఆశించడం సహజం. అందులో తప్పేం లేదు. పైగా టీమ్ కూడా అదే ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది. అలా అని దర్శకుడు మల్లి అంకం కేవలం దానికే కట్టుబడలేదు. సమాజంలో బ్రహ్మచారులు ఎదురుకుంటున్న సమస్యని మాట్రిమోనీ కంపెనీలు చేసే మోసాలతో ముడిపెట్టి సందేశం, వినోదం రెండు కలిపి ఒక ప్యాకేజీగా ఇవ్వాలని ప్రయత్నించాడు. అయితే త్రాసులో మెసేజ్ అనే బరువు ఒకవైపు ఎక్కువ కావడంతో తూకం కుదరక సరుకు కిందపడింది. మాములు జోకులకు జనాలు పగబడి నవ్వే రోజులు పోయాయని బాక్సాఫీస్ చాలాసార్లు ఋజువు చేస్తూనే వచ్చింది.

ఎక్కువ ఆలస్యం చేయకుండా నేరుగా పాత్రల పరిచయంతో మొదలుపెట్టిన మల్లి అంకం హీరో గణపతిని ఎస్టాబ్లిష్ చేసే తీరే వెరైటీగా ఉంటుంది. ఏదో మాస్ హీరో రేంజ్ లో ఫైట్ ఎందుకు పెట్టాడో అర్థం కాదు. కాసేపటికే రౌడీలతో కామెడీ చేయించి నవ్వుకోమంటాడు. గణకి అవసరానికి మించి బిల్డప్ ఆఫీస్ లోనే కాదు అపార్ట్ మెంట్ లో కూడా ఇస్తాడు. పక్కింటోళ్లు, డెలివరీ బాయ్స్ అందరికీ ఇతనికి పెళ్లి కాకపోవడం ఏదో అంతర్జాతీయ సమస్యలా ఫీలవుతున్నట్టు చూపిస్తాడు. నిజానికి ఇదంతా అతకని వ్యవహారం. తమ్ముడు, మరదలు, వాళ్ళ పిల్లలు, ఇతర ఫ్లాట్లలో ఉండే రకరకాల మనస్తత్వాలను వాడుకుని బోలెడు కామెడీ రాసుకోవచ్చు. కానీ అదేమీ జరగలేదు.

వెంకటేష్ మల్లేశ్వరిలో పెళ్లికాని ప్రసాద్ ని అంతగా గుర్తుపెట్టుకోవడానికి కారణం త్రివిక్రమ్ రాసిన టైమింగ్ తో కూడిన సన్నివేశాలు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత ఫ్రెష్ గా అనిపిస్తాయి. కానీ ఆ ఒక్కటి అడక్కులో ఏదీ స్పెషల్ గా ఫీలవ్వం. చాలా మాములుగా సీన్స్ వెళ్తూ ఉంటాయి. మెయిన్ పాయింట్ మ్యారేజీ బ్యూరోకి చేరాక పికపవుతుందేమో అనుకుంటే కథనం పూర్తిగా గాడి తప్పేసింది. బ్యాచిలర్స్ ని మోసం చేసే మ్యాట్రిమోనీలు ఉన్న మాట వాస్తవమే కానీ వాటికి వెళ్లే ప్రతిఒక్కరు మరీ అమాయకులనేంతగా చూపించిన విధానం కన్విన్సింగ్ గా లేదు. ప్రభుత్వ ఉద్యోగి అయిన గణపతి చాలా తేలికగా మోసపోవడం సినిమాటిక్ లిబర్టీ అంటే ఏం చేయలేం.

ఇంటర్వెల్ తర్వాత గ్రాఫ్ ఏమైనా పెరిగి ఎంటర్ టైన్మెంట్ డోస్ ఉంటుందనుకుంటే మల్లి అంకం వ్యహావరాన్ని ఇంకా సీరియస్ గా మార్చేశాడు. అన్యాయానికి గురైన ఓ అమ్మాయి, డబుల్ పెళ్లిళ్లు చేసుకునే ఓ మోసగాడు, మధ్యతరగతి తండ్రి ఇలా సీరియల్ కష్టాలన్నీ ముడిపెట్టబోయి చివర్లో కోర్టు సీన్ ద్వారా పెద్ద సందేశం ఇవ్వాలని ట్రై చేయడం పొంతన లేకుండా సాగుతుంది. దర్శకుడి ఉద్దేశం జనాలకు కనెక్ట్ కానప్పుడు క్లైమాక్స్ లో ఎంత మంచి ఉపదేశాలు ఇచ్చినా లాభముండదు. పైపెచ్చు చూపించింది నూటికి తొంభై మంది బాధ పడే సమస్య కాదు. మహా అయితే వందలో పాతిక మందికి ఉండే ఇబ్బందిని ఇంతగా జనరలైజ్ చేయాల్సిన అవసరం లేదు.

దీనికి బదులు విశ్రాంతికి గణపతికి పెళ్లి చేసి కోడలు ఇంటికి వచ్చాక ఎదురయ్యే చిక్కులను ఫన్నీగా తీర్చిదిద్దడం ద్వారా వినోదానికి బోలెడు స్కోప్ ఉండేది. అలా కాదని సెంట్రల్ పాయింట్ ని కేవలం మ్యారేజ్ బ్యూరో చుట్టే నడిపించాలని చూడటంతో ల్యాగ్ ఎక్కువైపోయి స్క్రీన్ ప్లే ఎటు వెళ్తుందో అర్థం కాక బోర్ కొట్టేస్తుంది. సరదా టైటిల్ పెట్టి అల్లరి నరేష్ ని ఎక్కువసేపు సీరియస్ మోడ్ లో ఉంచితే ఆడియన్స్ అంగీకరించరని మల్లి గుర్తు పెట్టుకుని ఉండాల్సింది. ట్రెండ్ ని భిన్నంగా పాత తరహా టేకింగ్ తో ఓ మోస్తరు రాతతో బండి లాగిద్దామనుకుంటే పనవ్వదు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, రైటర్ల నుంచి మల్లి అంకం తనకు కావాల్సింది అడగలేదు. అందుకే ప్రేక్షకులు కోరుకుంది దక్కలేదు.

నటీనటులు

ఎప్పటిలాగే అల్లరి నరేష్ తన టైమింగ్ తో గణపతిగా సులభంగా అల్లుకుంటూ పోయాడు. అలవాటైన రీతిలో మెప్పించిన అతని ఎనర్జీని పూర్తిగా వాడుకునే స్థాయిలో కంటెంట్ లేదు. ఫరియా అబ్దుల్లా ఓకే. వంకలు లేవు కానీ ఇంకాస్త బొద్దుగా మారిన ఫీలింగ్ కలుగుతుంది. హరితేజ కొంత వరకు పర్వాలేదు. గణ అపార్ట్ మెంట్ లో పక్క ఫ్లాట్స్ లో ఉండేవాళ్ళుగా నటించిన ఆర్టిస్టులను పెద్దగా ఉపయోగించుకోలేదు. జానీ లివర్ కూతురు జామీ లివర్ గణ తమ్ముడి భార్యగా అంతగా నప్పలేదు. కొన్ని ఎక్స్ ప్రెషన్లు ఓవరయ్యాయి. వేరే ఛాయస్ చూడాల్సింది. హర్ష చెముడు, థర్టీ ఇయర్స్ పృథ్వి, వెన్నెల కిషోర్ సోసోనే. మురళీశర్మ, గౌతమి అతిథి పాత్రలు.

సాంకేతిక వర్గం

గోపి సుందర్ సంగీతం సాధారణంగా ఉంది. ఇలాంటి వాటిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు పెద్దగా స్కోప్ ఉండదు కాబట్టి దాని గురించి చెప్పడానికేం లేకపోయినా ఒక పాట పర్వాలేదనిపిస్తే మిగిలినవి మాత్రం ఫార్వార్డ్ బ్యాచే. సూర్య ఛాయాగ్రహణం సాధారణం. కొన్ని సీన్లలో అవసరం లేని క్లోజప్ లు ఇబ్బంది పెడతాయి. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ అనుభవం లెన్త్ వీలైనంత కుదించే ప్రయత్నం చేసింది కానీ మ్యాటర్ బలంగా లేకపోవడం వల్ల ఈ సెక్షన్ మీద కామెంట్ చేయలేం. అబ్బూరి రవి డైలాగులు మాములుగా ఉన్నాయి. కొన్ని భావోద్వేగాలకు సంబంధించిన మాటలు బాగున్నాయి కానీ కామెడీ పండలేదు. నిర్మాణ విలువలు సబ్జెక్టుకు తగ్గట్టు పెట్టారు

ప్లస్ పాయింట్స్

అల్లరి నరేష్
తీసుకున్న థీమ్

మైనస్ పాయింట్స్

అతి మాములు కామెడీ
రొటీన్ ట్రీట్ మెంట్
సంగీతం
కనెక్టవ్వని ఎమోషన్స్

ఫినిషింగ్ టచ్ : అడిగింది ఇవ్వలేదు

రేటింగ్ : 2 / 5