వార్తలు చదవడం.. ఒక వృత్తి. ఇప్పుడు ఈ వృత్తిలో అనేక మంది రాణిస్తున్నారు. అయితే.. ఇన్ని మీడియా చానెళ్లు లేనప్పుడు.. 1980-99ల మధ్య దూరదర్శన్ లో ప్రసారమయ్యే వార్తలకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. అయితే.. దీనిలోనూ ఎంతో మంది యాంకర్లు పనిచేసినా.. ఒకే ఒక్క పేరు మాత్రం ఉమ్మడి ఏపీలో మార్మోగి పోయేది. అదే.. శాంతి స్వరూప్. ఆయన వార్తలు చదివితే.. చదివినట్టుగా అనిపించదు. మన తమ్ముడో.. అన్నో.. బాబాయో.. మన పక్కన కూర్చుని.. మనకు వినిపిస్తున్నట్టు ఉంటుంది.
వార్తల కోసం వేచి ఉండే పరిస్థితి తీసుకువచ్చిన శాంతి స్వరూప్.. చదవడానికి కూడా కొత్త కళను అద్దారు. ఏ వార్తను ఎలా చదవాలో.. ఏ వార్తను ఏ స్థాయి పిచ్‌లో వినిపించాలో.. కంఠాన్ని ఎక్కడ సవరించుకోవాలో.. ఎక్కడ పెంచాలో తెలిసిన.. వార్తల మాంత్రికుడిగా ఆయన అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. ఇది ఆయనకు వార్త చదువరిగా ఎనలేని గుర్తింపు తెచ్చింది. వార్తలు చదవడం కూడా ఒక కళేనా? అని అనుకునే రోజుల్లో శాంతి స్వరూప్ ఔను.. ఇది కూడా కళే అని తన శైలితో నిరూపించారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అర్ధమయ్యేలా.. తెలుగు పదాలను క్షుణ్నంగా చదువుతూ.. ఎక్కడా మింగేయడం.. ఎక్స్‌ప్రెస్‌గా పరుగులు పెట్టడం లేకుండా.. శాంతి స్వరూప్ వినిపించిన వార్తలు.. ఆయన శ్రావ్యమైన కంఠం వంటివి.. ఇప్పటికీ.. నాటి తరం దూరదర్శన్ అభిమానులకు వీనుల్లో వినిపిస్తూనే ఉంటాయి. వార్తలకు ఇంతగా వినసొంత తేనెలద్దిన శాంతి స్వరూప్ ఇక లేరు. శుక్రవారం ఉదయం ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్ను మూశారు.
1977 లో దూరదర్శన్ శాశ్వత ఉద్యోగిగా అడుగు పెట్టిన ఆయన రెండేళ్ల తర్వాత యాంకర్ అయ్యారు. “నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు..”అంటూ ఆయన ప్రారంభించే శ్రావ్యమైన గళం అనతి కాలంలోనే గుర్తింపు పొందింది. ఆయన కేవలం వార్తలకే పరిమితం కాలేదు. రచయితగా కూడా గుర్తింపు పొందారు. “రాతిమేఘం” అనే నవల భోపాల్ గ్యాస్ దుర్ఘటనమీద, “క్రేజ్” అనే నవల క్రికెట్ మీద, “అర్ధాగ్ని” అనే నవల సతీ సహగమనానికి వ్యతిరేకంగానూ రాశారు. శాంతి స్వరూప్ గళం, ఆయన నిదానం వంటివి నేటి తరం యాంకర్లకే కాకుండా వ్యాఖ్యాతలకు కూడా స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates