దేశ ప్రజలపై పెట్రో బాంబు పడనుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తోడు అంతర్జాతీయంగా పెరిగిన ముడిచమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో గత 4 నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోధరలు ఒక్కసారిగా పెరగనున్నాయి. పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్‌పై పెంపు లీటరుకు 12-15 రూపాయల వరకు ఉంటుందని చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి. నష్టాలను భరించేందుకు మరో రెండు మూడు రోజుల్లోనే ఈ మేరకు పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా గత నాలుగు నెలలుగా పెట్రో ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గురువారం తొమ్మిదేళ్ల గరిష్ఠానికి చేరి బ్యారెల్‌కు 120 అమెరికన్ డాలర్లుగా నమోదైంది. ఇవాళ క్రూడాయిల్ ధర కొంత తగ్గి 111 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. ఇక వచ్చే వారం ఎన్నికలు ముగియనుండగా.. పెట్రోధరల పెంపు అనివార్యమని చమురు సంస్థలు చెబుతున్నాయి.
గత నెలలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రకటించిన నాటి నుంచీ అంతర్జాతీయంగా చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. యుద్ధంతో రష్యా నుంచి దిగుమతయ్యే ఆయిల్, గ్యాస్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఐరోపా సహజవాయు అవసరాల్లో మూడో వంతు రష్యా నుంచే అందుతోంది. ప్రపంచ చమురు అవసరాల్లో 10 శాతం రష్యానే తీరుస్తోంది. రష్యా నుంచి ఐరోపాకు గ్యాస్‌ను సరఫరా చేసే పైప్లైన్లలో మూడోవంతు ఉక్రెయిన్ నుంచే వెళుతున్నాయి.
అయితే, రష్యా నుంచి భారత్ దిగుమతులు చాలా తక్కువే. 2021లో రష్యా నుంచి భారత్‌కు 43,400 బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి అయ్యింది. ఇది మొత్తం మన చమురు దిగుమతుల్లో 1 శాతం మాత్రమే. అయినప్పటికీ యుద్ధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. దీంతో భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. అయితే.. ఈ ధరల పెంపుతో అన్ని సరుకులు.. రవాణా వ్యవస్థలపై ప్రభావం తీవ్రంగా పడనుంది. బియ్య, పప్పులు వంటివి మరింత మండిపోనున్నాయి. సగటు జీవి బతుకు దుర్భరంగా మారుతుందని.. మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates