వణికిపోతున్న బ్రిటన్

మళ్ళీ బ్రిటన్ వణికిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే కరోనా వైరస్ కేసులు మళ్ళీ విజృభిస్తుండటమే. గడచిన 24 గంటల్లో ఇంగ్లాండ్ మొత్తం మీద 50 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వానికి ఏమి చేయాలో అర్థం కావటం లేదు. గడచిన మూడు నెలల్లో ఇన్ని వేల కేసులు నమోదవ్వటం ఇదే మొదటిసారి. చాలా దేశాలతో పోల్చుకుంటే బ్రిటన్లో వ్యాక్సినేషన్ ముందే ప్రారంభమైంది. అయితే మెల్లిగా జనాలు ముఖ్యంగా యూత్ టీకాల విషయంలో నిర్లక్ష్యంగా చూపించారు.

ఇదే సమయంలో జనాలు కూడా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడంలో నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేశారు. ఒకవైపు టీకాలు తీసుకోవటంలో నిర్లక్ష్యం మరోవైపు జాగ్రత్తలు పాటించకపోవటంతో కరోనా వైరస్ మళ్ళీ ఒక్కసారిగా విజృంభించింది. బ్రిటన్ వైద్య నిపుణుల అధ్యయనం ప్రకారం కొత్తగా వైరస్ సోకిన వాళ్ళంతా 35-55 ఏళ్ల మధ్య వారేనని తేలింది. దీంతో యువత ఎక్కువగా ఎఫెక్టయినట్లు అర్ధమవుతోంది.

ముందు యువతకు సోకుతున్న వైరస్ తర్వాత మెల్లిగా నడివయసు వాళ్ళకి అక్కడి నుండి 55 ఏళ్ళ వయసు వారికి సోకుతున్నట్లు అధ్యయనంలో తేలింది. వారిద్వారా 55 ఏళ్ళ పైబడిన వారికి సోకుతున్నట్లు వైద్యులకు అర్ధమైంది. దీంతో మొన్నటి సెప్టెంబర్ లో మొత్తం బ్రిటన్లో విద్యా సంస్థలు తెరిచారు. విద్యా సంస్ధలకు హాజరైన వారి వివరాలు ఆరాతీస్తే వారిలో అత్యధికులు టీకాలు తీసుకోలేదని తేలింది. దాంతో యువతలో వైరస్ ఒకరి నుండి మరొకరికి పాకిపోయింది.

యువతలో పాకిన వైరస్ తర్వాత మధ్య వయసుల వారికి వారి నుండి వృద్ధులు పాకుతోందని అధ్యయనాల్లో స్పష్టంగా తేలింది. దీంతో ఏమి చేయాలో అర్థం కాక బ్రిటన్ ప్రభుత్వం తలపట్టుకుంది. ఇదే సమయంలో దాదాపు 6 నెలల క్రితం ఆస్ట్రాజెనికా టీకాలు తీసుకున్న చాలామందిలో యాంటీబాడీలు క్షీణించాయని పరిశోధనల్లో తేలింది. అంటే టీకాల రక్షణ ఎక్కువ నెలలు ఉండటం లేదని కూడా అర్ధమైపోయింది. మరలాంటి వాళ్ళకు మళ్ళీ మూడో టీకా వేయాలా ? లేకపోతే క్వారంటైన్ లో ఉంచాలా అన్నదే అర్ధం కావటంలేదు.