బ్రిటన్ ఎంపీ ఒకరు దారుణమైన రీతిలో హత్యకు గురయ్యారు. పెను సంచలనంగా మారిన ఈ ఉదంతం ఒక చర్చిలో జరగటం గమనార్హం. 69 ఏళ్ల ఎండీ డేవిడ్ అమీస్ అధికార కన్జర్వేటివ్ పార్టీ నేత. 1983 నుంచి ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఎసెక్స్ లోని సౌత్ ఎండ్ వెస్ట్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం స్థానికంగా ఉన్న లీ- ఆన్ – సీ లోని ఒక చర్చిలో అక్కడి స్థానిక పౌరులతో కలిసి వీకెండ్ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఆయనపై దాడి చేశాడు. తనతో తెచ్చుకున్న కత్తితో పలుమార్లు పొడిచాడు. ఒక్కసారిగా జరిగిన ఈ ఉదంతంతో షాక్ తిన్నారు. తేరుకునే లోపే.. ఎంపీ తీవ్ర గాయాలకు గురయ్యారు. వెంటనే.. ఆయన్ను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న ఎంపీ.. చికిత్స పొందుతూనే ఆసుపత్రిలో కన్నుమూశారు. స్థానిక పోలీసులు ఎంపీ మరణాన్ని నిర్దారించారు.
ఈ ఉదంతంలో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణను ప్రారంభించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ తరఫున డేవిడ్ అమీస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పలు సామాజిక అంశాల మీద.. జంతువుల సమస్యల మీదా పోరాడుతుంటారు. మహిళల గర్భ స్రావాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది.
హత్యకు గురైన వైనం సంచలనంగానే కాదు.. షాకింగ్ గా మారింది. ఈ దారుణ హత్యపై దిగ్భాంత్రి వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఎంపీలపై దాడి జరిగి హత్య చేయటం గతంలోనూ జరిగినట్లుగా చెబుతున్నారు. 2016లో బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో లేబర్ పార్టీకి చెందిన ఎంపీ జో కాక్స్ ను కాల్చి చంపిన ఘటన తర్వాత చోటు చేసుకున్న హత్య ఇదే. అంతకు ముందు 2010లో లేబర్ పార్టీకి చెందిన ఎంపీ కూడా కత్తిపోట్లకు గురైనట్లు గుర్తు చేస్తున్నారు.