ఇవాల్టి రోజున ప్రపంచంలో వాట్సాప్.. ఫేస్ బుక్.. ట్విటర్.. ఇన్ స్టా లేకుంటే ఎలా ఉండేది? వినేందుకు సైతం ఇష్టపడటం లేదా? నిజమే.. ప్రపంచ వ్యాప్తంగా పలు పరిణామాలకు ఈ నాలుగు ఏదో రకంగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ప్రపంచంలోని ప్రతి పరిణామం వెనుక వీటి పాత్ర అంతో ఇంతో ఖాయం. నిజానికి ట్వీట్ పిట్ట దెబ్బకు ఎంతమంది ప్రముఖుల జీవితాలు మసకబారిపోయాయి. మరెంత మంది సామాన్యులు సెలబ్రిటీలుగా మారారో తెలిసిందే. మరి.. ఆ ట్వీట్ పిట్ట తొలిసారి కూత పెట్టిన ట్వీట్ ఏమై ఉంటుంది? దాన్ని అమ్మకానికి పెడితే?
సరిగ్గా అదే పని చేశారు ట్విటర్ సీఈవో. దాదాపు పదిహేనేళ్ల క్రితం.. అంటే 2006 మార్చి 21న ట్విటర్ సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సీ తొలి ట్వీట్ పోస్టు చేశాడు. దాని సారాంశం.. ‘జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విటర్’ అని. అది మొదలు ట్వీట్ పిట్ట ఏదో ఒకటి పలుకుతూనే ఉంది. ఇవాల్టి రోజున దాని పలుకు పుణ్యమా అని ప్రభుత్వాలు సైతం పడిపోయే వరకు వచ్చింది.
అందరి జీవితాల్లో భాగమైన ట్విటర్ తొలి ట్వీట్ ను అమ్మకానికి పెట్టారు జాక్ డోర్సీ. వాల్యుయబుల్స్ బై సెంట్ అనే వెబ్ సైట్ లో తన తొలి ట్వీట్ ను అమ్మకానికి పెడితే.. ఇప్పటివరకు ఆ ట్వీట్ ను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. అత్యధికంగా 2.5 మిలియన్ డాలర్లు ఇచ్చి.. మన రూపాయిల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర రూ.18.3 కోట్లు పెట్టి కొనుక్కునేందుకు సిద్ధమయ్యారు.
ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసేకునే ఈ తొలి ట్వీట్ వల్ల ప్రయోజనం ఏమంటారా? ఏమీ ఉండదు కానీ.. సదరు తొలి ట్వీట్ ను కొనుగోలు చేసినట్లుగా ట్విటర్ సీఈవో డిజిటల్ గా వెరిఫై చేసి.. సంతకం పెట్టి ఒక ధ్రువపత్రాన్ని అందజేస్తారు. ఆ పత్రంలో తొలి ట్వీట్ చేసిన సమయంతో పాటు.. అందులోని వివరాలు ఉంటాయి. ఈ మాత్రానికి రూ.18.3 కోట్లు ఖర్చు పెట్టాలా? అంటే.. ఎవరిష్టం వారిది మరి.