పిలవని పేరంటానికి వస్తే పోలీస్ కేసు

పెళ్లిళ్లకు ఆహ్వానం లేకుండానే వెళ్లి విందు భోజనాలు చేసే వారికి తెలంగాణలోని వనపర్తిలో ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం గట్టి హెచ్చరిక చేసింది. అనుమతి లేకుండా పెళ్లికి వచ్చి భోజనం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెళ్లిళ్లలో అతిథుల సంఖ్యను ముందుగానే అంచనా వేసి వంటకాలు సిద్ధం చేస్తారు. కానీ ఆహ్వానం లేకుండా వచ్చే వారి వల్ల ఆహారం సరిపోకపోవడం, నిర్వాహకులకు అదనపు ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ హెచ్చరికలో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 329ను (పాత ఐపిసి సెక్షన్ 441) ప్రస్తావించారు. ఈ సెక్షన్ నేరపూరిత ఉద్దేశంతో ఇతరుల ఆస్తిలోకి ప్రవేశించడం లేదా అక్కడే ఉండిపోవడానికి సంబంధించినది. నేరం నిరూపితమైతే మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.5,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

అయితే పెళ్లికి ఆహ్వానం లేకుండా వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఈ సెక్షన్ వర్తించదు. నేరపూరిత ఉద్దేశం ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. కేవలం భోజనం చేయడానికి వెళ్లినంత మాత్రాన నేరం నిరూపితమైనట్లు కాదు. ఏదేమైనా, ఇతరుల శుభకార్యాలకు ఆహ్వానం లేకుండా వెళ్లి ఇబ్బందులు సృష్టించడం సరైన పద్ధతి కాదు. ఉచిత భోజనం కోసం వెళ్లి అనవసరమైన సమస్యలు తెచ్చుకోవడం ఎందుకనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు వస్తోంది.