అందంగా కనిపించాలనే కోరికతో చాలామంది రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గుతాయని చెప్పే ఫెయిర్‌నెస్ క్రీములకు యువతలో మంచి డిమాండ్ ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసే ప్రచారాలు చూసి వాటిని కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఇలాంటి ఉత్పత్తుల వెనుక ఎలాంటి ప్రమాదాలు దాగి ఉంటాయో కేరళలో జరిగిన ఓ ఘటన మరోసారి బయటపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన ప్రకటనను నమ్మి ఫెయిర్‌నెస్ క్రీమ్ ఉపయోగించిన 17 ఏళ్ల బాలిక తీవ్ర కిడ్నీ సమస్యతో ఆసుపత్రి పాలైంది.
కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఈ బాలిక సోషల్ మీడియాలో వచ్చిన ప్రచార వీడియోలు చూసి ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ కొనుగోలు చేసింది. ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగిపోతాయని ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పడంతో ఆ ఉత్పత్తిపై ఆసక్తి చూపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇచ్చిన వాట్సాప్ నంబర్ ద్వారా విక్రేతలను సంప్రదించి క్రీమ్ ఆర్డర్ చేసింది. మొదట్లో ఫలితాలు కనిపిస్తున్నాయని భావించడంతో దాదాపు ఏడాది పాటు ఆ క్రీమ్‌ను ఉపయోగించింది. ఈ క్రమంలో పలుమార్లు కొత్త బాటిళ్లను కూడా కొనుగోలు చేసింది.
అయితే కొంతకాలం తర్వాత ఆమె ఆరోగ్యంలో అనూహ్య మార్పులు కనిపించాయి. అకస్మాత్తుగా రక్తపోటు తగ్గిపోవడం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు మొదలయ్యాయి. కాళ్లకు వాపులు రావడంతో నడవడం, మెట్లు ఎక్కడం కూడా కష్టంగా మారింది. పరిస్థితి మరింత దిగజారడంతో కుటుంబ సభ్యులు ఆమెను మలప్పురంలోని ఆస్టర్ మిమ్స్ మదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమె శరీరంలో ప్రమాదకర స్థాయిలో పాదరసం ఉన్నట్లు గుర్తించారు.
నెఫ్రాలజీ నిపుణురాలు డాక్టర్ గౌరీ ఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలికకు మెంబ్రానస్ నెఫ్రోపతి అనే తీవ్రమైన కిడ్నీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ సమస్య వల్ల మూత్రపిండాల్లోని రక్తాన్ని వడపోసే భాగాలు దెబ్బతింటాయి. ఫలితంగా శరీరం నుంచి అధిక మొత్తంలో ప్రోటీన్ మూత్రం ద్వారా బయటకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. క్రీమ్ నమూనాలను పరీక్షించగా అందులో 12,500 పార్ట్స్ పర్ మిలియన్ స్థాయిలో పాదరసం ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సౌందర్య ఉత్పత్తుల్లో అనుమతించబడే పరిమితి ఒక పిపిఎం కంటే తక్కువగా ఉండాలి. అంటే ఆ క్రీమ్‌లో గుర్తించిన స్థాయి సాధారణ పరిమితి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.
ప్రస్తుతం బాలిక చికిత్స పొందుతూ కోలుకుంటోంది. అయితే ఈ ఉత్పత్తిని తయారు చేసిన సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబం నిర్ణయించింది. వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. సంస్థను సంప్రదించి తన ఆరోగ్య సమస్యల గురించి వివరించినప్పటికీ సరైన స్పందన రాలేదని బాలిక ఆరోపించింది. న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో క్రీమ్ పేరు వెల్లడించలేదు.
మరోవైపు, తక్షణమే చర్మం తెల్లగా మారుతుందని, మచ్చలు పూర్తిగా తొలగిపోతాయని చెప్పే ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దని వైద్యులు సూచిస్తున్నారు. చర్మ సంబంధిత సమస్యలు ఉంటే సోషల్ మీడియా సలహాల కంటే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడమే మంచిదని చెబుతున్నారు. అందం కోసం ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టుకోవద్దని ఈ ఘటన ప్రతి ఒక్కరికీ హెచ్చరికగా నిలుస్తోంది.
This post was last modified on November 21, 2026 7:21 pm
రామాయణ పార్ట్ 1 వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసినా సినిమాలో నటన పరంగా ఎక్కువ పేరు వచ్చింది యష్,…
వచ్చే వారం నవంబర్ 27 విడుదల కావాల్సిన మైసా వాయిదా పడి డిసెంబర్ 11 వెళ్లిపోయిందనే వార్త కొందరు ఆశ్చర్యంగా…
శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్‌గా.. శనివారం సీనియర్ నాయకుడు, దివంగత పరిటాల రవి వారసుడు పరిటాల శ్రీరాం ప్రమాణ స్వీకారం…
బెంగుళూరులోని యలహంక ప్యాలెస్ విషయంలో వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలల మధ్య వివాదం ముదిరి పాకానపడినట్లు…
అనిల్ రావిపూడి సినిమా వస్తోందంటే సోషల్ మీడియాలో ఒక వర్గం అలెర్టయిపోతుంది. కామెడీ పేరుతో క్రింజ్ చేస్తున్నాడని కొందరు, టీవీ…
డిసెంబర్ 4 విడుదల కావాల్సిన వృషకర్మ మీద అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. వాయిదా తప్పదనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…