జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే.. దీనిపై అధికారికంగా అటు రాధా నుంచి కానీ.. ఇటు జ‌న‌సేన నుంచి కానీ .. ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. ప్ర‌స్తుతం మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల క్ర‌మంలో జ‌న‌సేన‌ను మ‌రింత పుంజుకునేలా చేసేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వంగ‌వీటి రాధాను జ‌న‌సేన‌లోకి ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల కూడా వంగ‌వీటి రాధా.. డిప్యూటీ సీఎం, జ‌న‌సేనాని ప‌వ‌న్‌తో భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా రాధా రాజ‌కీయ ప‌రిస్థితులు.. వ్య‌క్తిగ‌త ఇమేజ్ వంటివాటిపై చ‌ర్చించారు. అనంత‌రం.. రాధా జ‌న‌సేన అరంగేట్రంపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఇక‌, తాజాగా దీనిపై అన‌ధికార ప్ర‌క‌ట‌న‌లు కూడా వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం రాధా టీడీపీలో ఉన్నారు. 2024లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కావాల‌ని కోరుతూ.. యాగం కూడా చేశారు. అనంత‌రం.. అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా అక్క‌డి రైతుల ప‌క్షాన ఉద్య‌మాల్లోనూ పాల్గొన్నారు. అయితే.. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ఆయ‌న‌కు ఎమ్మెల్సీ పోస్టు ఇస్తార‌ని.. రాజ్య‌స‌భ‌కు పంపించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ, అవి సాకారం కాలేదు.

ఇక‌, ఇటీవ‌ల కాలంలో రాధా పూర్తిస్థాయిలో సైలెంట్ అయిపోయారు. కాగా.. ప్ర‌స్తుతం తెర‌మీద‌కు వ‌చ్చిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాధా త‌న దృష్టిని జ‌నసేన‌పై పెట్టిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో కూడా.. ఆయ‌న కాంగ్రెస్‌లో ఉండ‌గా.. 2007లో స్థాపించిన ప్ర‌జారాజ్యంలో చేరారు. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ.. వైసీపీలోకి వ‌చ్చారు. అనంత‌రం.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2004లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యవాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత‌.. వ‌రుస ప‌రాజ‌యాలు త‌ప్ప‌లేదు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో అస‌లు టికెట్ కూడా లేని ప‌రిస్థితిని ఆయ‌న ఎదుర్కొన్నారు.

ఇప్పుడు జ‌న‌సేన‌లోకి రాధా చేరితే.. ఆయ‌న‌ను విజ‌యవాడ మునిసిప‌ల్ కార్పొరేషన్ మేయ‌ర్ ప‌ద‌వికి ఎంపిక చేస్తార‌ని తెలుస్తోంది. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతోపాటు.. రంగా వార‌సుడిగా కూడా విజ‌యవాడ‌లో రాధాకు బ‌ల‌మైన అనుచ‌ర వ‌ర్గం ఉంది. ఈ నేప‌థ్యంలోనే రాధాను ఎంపిక చేసి ఉంటార‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే.. విజ‌య‌వాడ‌లో రాధా పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇదిలావుంటే.. మేయ‌ర్ పోస్టును ఇప్ప‌టికే టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా కుమారుడు ర‌వితేజ కోరుకుంటున్నారు. దీనిపై సీఎం చంద్ర‌బాబుతోనూ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా రాధా పేరు తెర‌మీద‌కి రావ‌డం గ‌మ‌నార్హం.