13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన ఉద్యమం విజయవంతం అయిన తర్వాత దేశంలో కాక్రోచ్ ఇమేజ్ విపరీతంగా పెరిగిపోయింది. కేంద్రం సైతం కాక్రోచ్ దెబ్బకు దిగి వచ్చింది. ఢిల్లీ తర్వాత ఇప్పుడు ముంబై వేదికగా కాక్రోచ్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో పెద్ద ఎత్తున గందరగోళం, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ముంబై లోని శివాజీ పార్క్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున మొదలుపెట్టిన నిరసన ఇప్పుడు దేశంలో వేడి పుట్టిస్తోంది.

జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత కేంద్రంలోని బీజేపీ పాలకులు ఎలాగైనా సరే కాక్రోచ్ లను దెబ్బ తీసేందుకు రకరకాలుగా ప్రయత్నం చేస్తోంది. కాక్రోచ్ లో విభేదాలు సృష్టించి ముక్కలు చేయడం అందులో ఒకటి. రైట్ వింగ్ యూత్ ద్వారా కాక్రోచ్ తరహాలో రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం రెండోది. ఇవి రెండూ కూడా సక్సస్ కాలేదు. అయినప్పటికీ రైట్ వింగ్ ద్వారా కాక్రోచ్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతూనే వుంది. దీనికి బీజేపీ పెద్దల మద్ధతు ఉందన్నది బహిరంగ రహస్యం.

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఓట్ చోరీ సమస్య దేశం ముందుకు వచ్చింది. వెంటనే స్పందించిన కాక్రోచ్ ఆయనను తొలిగించాలని డిమాండ్ చేసింది. లేకపోతే జంతర్ మంతర్ తరహా ఉద్యమాన్ని చెప్పడతామని వార్నింగ్ ఇచ్చింది. అయినా కేంద్ర పాలకులు లెక్క చేయకుండా ఎన్నికల కమిషనర్ ను వెనకేసుకొని వస్తున్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు భారత రత్న అవార్డు ఇవ్వాలని ఒక బీజేపీ నాయకుడు డిమాండ్ చేయడం దీనికి నిదర్శనం. దీంతో ముందుగా హెచ్చరించినట్టే కాక్రోచ్ పార్టీ ఉద్యమానికి దిగింది.

ఈసారి సీన్ జంతర్ మంతర్ నుంచి ముంబై శివాజీ పార్క్ కు మారింది. మూడ్రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో శివాజీ పార్క్ కు చేరుకుంటున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ వుంది…

కాక్రోచ్ లు చేస్తున్న నిరసనలకు సమీపంలోనే బీజేపీ పెద్దల అండదండలు కలిగిన రైట్ వింగ్ నిరసనలకు దిగింది. పోలీసుల అనుమతి లేకుండా శివాజీ పార్క్ వద్ద నిరసనలకు దిగిన కాక్రోచ్ ల మీద చర్యలు తీసుకోవాలని కొందరు రైట్ వింగ్ నాయకులు డిమాండ్ చేయడం గమనార్హం. దీంతో పోలీసులు నిరసనకారుల మీద కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. అనుమతి లేకుండా గుమిగూడడం, లౌడ్ స్పీకర్లు వాడడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారంటూ ముంబై పోలీసులు శనివారం సీజెపి నిర్వాహకులతో పాటు సుమారు 500 మంది జెన్ జీ మీద కేసు నమోదు చేశారు.

దీనికి సీజెపి నాయకుడు అశుతోష్ రాంకా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. శివాజీ పార్క్ వద్ద ధర్నా చేయడానికి ముందస్తు పోలీసుల అనుమతి కావాలని అడుగుతున్నారు కదా… మరి దేశంలోని 13 కోట్ల మంది ఓట్లను తొలగించడానికి జ్ఞానేష్ కుమార్ ఎవరి అనుమతి తీసుకున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. ఔను కదా… ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా 13 కోట్ల ఓట్లను తొలగించడం అంటే మాటలా..? దీనికి కారకుడు జ్ఞానేష్ ఒక్కడేనా… వెనక వున్న పాత్రల సంగతేంటని జెన్ జీ ప్రశ్నిస్తుంది. జవాబు వస్తుందంటారా…??