శాంసంగ్ అధినేతకు రెండున్నరేళ్ల జైలు

ప్రపంచంలో అతి పెద్ద మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో ఒకటైన శాంసంగ్‌ సంస్థలో కీలక వ్యక్తి జైలు పాలు కాబోతున్నాడు. ‌శాంసంగ్ కంపెనీ మాజీ చీఫ్, ప్రస్తుత వైస్ ఛైర్మన్.. దక్షిణ కొరియాకు చెందిన లీ జే యాంగ్‌కు రెండున్నరేళ్ల జైలు శిక్ష ఖరారైంది. భారీ అవినీతి కేసులో ఆయ‌న‌కు కోర్టు ఈ శిక్ష‌ విధించింది. లంచాలు, నిధుల దుర్వినియోగం వంటి అభియోగాలు యాంగ్ ఎదుర్కొంటున్నాడు.

అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపిన శాంసంగ్ అవినీతి కేసు వ‌ల్లే రెండేళ్ల క్రితం ఏకంగా దక్షిణ కొరియా అధ్య‌క్షురాలు పార్క్ గెన్ హై త‌న ప‌ద‌వి కోల్సోవాల్సి వ‌చ్చింది. పార్క్ గెన్ అధికారాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు శాంసంగ్ చీఫ్ ముడుపులు ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి. ఆమెతో పాటు ఉన్నతాధికారులు చాలామందికి యాంగ్ భారీ స్థఆయిలో లంచాలు ముట్టజెప్పినట్లు అభియోగాలు ఉన్నాయి.

ప్ర‌పంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన తీరు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని కోర్టు పేర్కొంది. ప్రపంచంలో అత్య‌ధిక సంఖ్య‌లో స్మార్ట్‌ఫోన్లు అమ్మే సంస్థ‌గా శాంసంగ్‌కు గుర్తింపు ఉంది. ఈ టెక్ కంపెనీ ఎల‌క్ట్రానిక్ చిప్స్ కూడా త‌యారు చేస్తుంది. అవినీతి కేసులో మొదట సియోల్ కోర్టు లీ జే యాంగ్‌కు అయిదేళ్ల శిక్ష విధించినా.. ఇప్పుడు ఆ శిక్ష‌ను సగానికి కుదించారు. త్వరలోనే ఆయన జైలుకు వెళ్లాల్సి ఉంది. దీనిపై ఉన్నత స్థాయి కోర్టులో ఆయన సవాలు చేయనున్నారు.