ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చిరాకు వచ్చిన గ్రామస్తులు ఏకంగా ఏం చేశారో తెలుసా..? రెండేళ్లుగా 5జీ సిగ్నల్ సరిగ్గా రావడం లేదని ఆగ్రహించి నెట్‌వర్క్ సమస్యను పరిశీలించేందుకు వచ్చిన జియో టెక్నీషియన్‌ను మొబైల్ టవర్‌కు కట్టేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా హరదౌలి గ్రామంలో చోటుచేసుకుంది. నెట్‌వర్క్ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా పరిష్కారం లభించలేదని గ్రామస్థులు ఆరోపించారు.
హరదౌలి గ్రామంలో రెండేళ్లుగా 5జీ సేవలు సక్రమంగా అందడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆన్‌లైన్ తరగతులు, డిజిటల్ చెల్లింపులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. సమస్యను పరిశీలించేందుకు జియో టెక్నీషియన్ గ్రామానికి రావడంతో అతడిని పట్టుకున్న గ్రామస్థులు టవర్‌కు కట్టేసినట్లు సమాచారం.
దాదాపు రెండు గంటల పాటు టెక్నీషియన్ అక్కడే ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని అతడిని విడిపించారు. అనంతరం టెక్నీషియన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని గ్రామస్థులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనిని 5 జీ రెవల్యూషన్ అని సోషల్ మీడియాలో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates