చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది. అందుకే ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీలు ఏఐపై భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నాయి. 2025, 2026 రెండు సంవత్సరాల్లో టాప్ ఐదు కంపెనీలు కలిపి 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టొచ్చని బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ అంచనా వేసింది.
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏఐపై మొత్తం పెట్టుబడులు 4 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని కూడా అంచనా ఉంది. ఈ డబ్బు ఎక్కువగా చిప్స్ కొనడం, కొత్త డేటా సెంటర్లు నిర్మించడం, విద్యుత్ సదుపాయాలు పెంచడం, కొత్త ఏఐ మోడల్స్ తయారు చేయడానికి ఖర్చవుతోంది. సమస్య ఏంటంటే ఈ పెట్టుబడిలో కొంత అప్పుల ద్వారా వస్తోంది. కంపెనీలు ఇప్పుడు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి.
కానీ భవిష్యత్తులో AI సేవల నుంచి అనుకున్నంత ఆదాయం రాకపోతే ఆ అప్పులు తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. డేటా సెంటర్ల కోసం భారీగా అప్పు తీసుకున్న చిన్న కంపెనీలకు ఈ రిస్క్ ఇంకా ఎక్కువ. ఇది గతంలో డాట్‌కామ్ బూమ్ సమయంలో జరిగిన పరిస్థితిని కొంత గుర్తు చేస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
అప్పట్లో ఇంటర్నెట్ భవిష్యత్తు అని నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టారు. కొన్ని కంపెనీలు పెద్దవయ్యాయి. మరికొన్ని ఆదాయం రాక మూతపడ్డాయి. ఏఐ విషయంలో కూడా అదే ప్రశ్న ఇప్పుడు మొదలైంది. ఈ టెక్నాలజీ నిజంగా కంపెనీల ఖర్చులు తగ్గించి, ఆదాయం పెంచితే పెట్టుబడులు కొనసాగుతాయి. కానీ వేల కోట్ల ఖర్చుకు సరిపడా రాబడి రాకపోతే ముందుగా ఒత్తిడి పడేది అప్పులతో డేటా సెంటర్లు నిర్మిస్తున్న కంపెనీలపైనే.
Gulte Telugu Telugu Political and Movie News Updates