మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో నేర స్వభావం పెరిగిపోయింది. చిన్నా పెద్ద తేడా లేకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నారు. తెలంగాణాలో ఆ మధ్య డబ్బుల కోసం స్కూల్ ప్రిన్సిపాల్ ని ఇద్దరు విద్యార్థులు హతమార్చడం కలకలం సృష్టించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్కూలు సెలవు కోసం సాటి విద్యార్థిని హతమార్చే ప్రయత్నం చేయడం సంచలనం సృష్టిస్తుంది.
అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లి మండలం గ్యారంపల్లె గురుకుల పాఠశాలలో ఇద్దరు బాలురు ఎనిమిదివ తరగతి చదువుకుంటున్నారు. రోజూ స్కూలుకు వెళ్లడం, పుస్తకాలు ముందేసుకొని చదువు కోవడం బోర్ గా అనిపించింది. స్కూల్ ఎగ్గొట్టి ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. రెండేళ్ల క్రితం స్కూలు విద్యార్థి ఒకరు చనిపోయినప్పుడు సెలవు ఇచ్చారు. కనుక ఇప్పుడు కూడా ఎవరైనా చనిపోతే సెలవు ఇస్తారు కదాని భావించిన ఆ ఇద్దరు విద్యార్థులు సాటి విద్యార్థిని హత్య చేసేందుకు స్కెచ్ వేశారు.
ఎప్పటిలాగే హాస్టల్ చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అందరితో పాటు కలిసి నిద్ర పోతున్నట్లు నటించారు. అందరూ గాఢ నిద్రలో వున్నపుడు సాటి విద్యార్థి ముఖం మీద దిండు పెట్టి అదిమి పట్టారు. గొంతు నులిమెందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా మేల్కొన్న సదరు విద్యార్థి వారి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయట పడ్డాడు. వెంటనే వార్డెన్ దృష్టికి తీసుకెళ్లాడు. విషయం బయటకు వస్తే రచ్చవుతుందని భావించిన వార్డెన్ దీన్ని తొక్కి పెట్టాడు.
ఈ సంగతి ఈ నోటా, ఆ నోటా పడి ఎంఈఓ రెడ్డి బాషా దగ్గరకు చేరింది. ఆయన బుధవారం హాస్టల్ ను సందర్శించారు. బాధిత విద్యార్థిని అడిగి వివరాలు రాబట్టారు. మిగతా విద్యార్థులతో ఆరా తీశారు. వార్డెన్ కు క్లాస్ పీకిన ఆయన హత్యాయత్నానికి పాల్పడిన ఆ ఇద్దరికి టీసీ ఇచ్చి పంపించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు మీడియాకు తెలిపారు. సదరు మైనర్ విద్యార్థులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తలిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం వుందని మానసిన నిపుణులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates