అర్జెంటీనా సముద్రం ఇంకి పోయిందా?

అర్జెంటీనాలో జరిగిన ఒక విచిత్ర పరిణామం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. రాత్రికి రాత్రే ఒక సముద్రం ఇంకిపోయిందని, కలియుగం ఆసన్నమైందని ఎవరికి తోచినట్లు వాళ్ళు కథలు కథలుగా చెవులు కొరుక్కున్నారు. ఒకవైపు సూపర్ ఎల్ నినో గురించి జరుగుతున్న ప్రచారం ప్రజలను భయపెడుతుంటే మరో వైపు అర్జెంటీనా సముద్రంలో నీరు మాయమవడంతో ఏదో జరగబోతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఆగస్టు చివరిలో మొదలైన ఈ ప్రచారం సెప్టెంబర్ మొదటి వారంలో పీక్ కు చేరింది. ఇంతకూ ఏమి జరిగిందంటే…

అర్జెంటీనాలోని బ్యూనస్ ఐర్స్ ప్రావిన్స్ లో వున్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన మార్ డెల్ ప్లాటా తీరంలో ఉన్నట్టుండి సముద్రంలోని నీరు చాలా వెనక్కి వెళ్ళిపోయింది. నీరు వెనక్కి వెళ్లడంతో కొన్ని పడవలు, చిన్న చిన్న బొట్లు ఇసుకలో కదలలేక ఎక్కడివక్కడే నిలిచి పోయాయి. దాంతోపాటు సముద్ర గర్భంలో దాగివుండే రాతి నిర్మాణం ఒకటి బయట పడింది. దీన్ని చూసిన పర్యాటకులు, స్థానికులు సముద్రంలోంచి కొత్త ద్వీపం పుట్టుకొచ్చిందని పుకార్లు షికార్లు చేశాయి.

అసాధారణమైన రీతిలో జరిగిన ఈ పరిణామం నిముషాల్లో ప్రపంచమంతా వ్యాపించింది. ఈ విచిత్రం చూడ్డానికి స్థానికులు ఎగబడ్డారు. వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చుక్క నీరు లేకుండా మొత్తం సముద్రం ఇంకి పోయిందని ప్రచారం చేశారు. నీరు వెనక్కి వెళ్లిన ప్రదేశాన్ని వీడియోలో చూపించారు. కొంతమంది అత్యుత్సాహంతో భారీ ఓడలు ఇసుకలో కూరుకొని పోయినట్లు వీడియోలు సృష్టించారు. అయితే ఆ ఓడలు గుజరాత్ లోని అలంగ్ షిప్ బ్రేకింగ్ యార్డ్ కు సంబందించిన పాత వీడియోలుగా అధికారులు నిర్ధారించారు.

అయితే సముద్రం ఇంకిపోవడం నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. సముద్రంలో నీరు వెనక్కి పోయిన మాట నిజమేనని అంగీకరిస్తున్నారు. సముద్రంలో నీటి మట్టం సాధారణం కంటే చాలా కిందకు పడిపోయిందని, వాతావరణ పీడన మార్పుల వల్ల నీరు సముద్ర తీరం నుండి చాలా వెనక్కు వెళ్లిందని వివరిస్తున్నారు. ఇది ఒక సహజమైన భౌగోలికమార్పని, దీన్ని ఏవేవో ఊహించుకుంటున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

విచిత్రం ఏమిటంటే ఈ ప్రచారం జరుగుతున్న సమయంలోనే, కేవలం కొన్ని గంటల వ్యవధిలో సముద్రంలో నీరు యధాతధంగా చేరుకుంది. సహజమైన సముద్రపు పోటు సైకిల్ మారడంతో ఎప్పటిలాగే నీరు తీరానికి చేరుకుందని నిపుణులు ప్రకటించారు. శాస్త్రవేత్తలు సైతం వాతావరణంలో ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయాని తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. ప్రజలు మాత్రం ఈ పరిణామాలు కలియుగం అంతం అవుందనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.