“హలో… ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!” రజనీకాంత్ రోబో సినిమాలో డైలాగ్ గుర్తుందా.. ఇప్పుడు అటువంటి రోబోలు నిరసనకు దిగాయి. ఏఐ, రోబోటీకరణతో ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందంటూ పోలాండ్‌లో సరికొత్త తరహా నిరసన జరిగింది. సుమారు 30 రోబోలు దేశ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎదుట ఆందోళన చేశాయి. పోలాండ్ జెండాలను చేతబూని.. కృత్రిమ మేధ, రోబోటీకరణపై కఠినమైన నియంత్రణలు తీసుకురావాలని డిమాండ్ చేశాయి.
“మాకు నియంత్రణలు కావాలి.. నిబంధనలు కావాలి.. చట్టం కావాలి”, “ఆలస్యం చేయొద్దు.. నియంత్రించండి.. ఉద్యోగాలను కాపాడండి” అంటూ రోబోలు నినాదాలు చేశాయి. ఈ నిరసనను ‘డెమోక్రాటిజం’ అనే సంస్థ నిర్వహించింది. కొత్త సాంకేతికతలు కార్మిక రంగంపై చూపించే ప్రభావంపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాల్సిన అవసరాన్ని చాటిచెప్పడమే తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
నిరసనకారులను పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రి క్రిష్టోఫ్ గావ్‌కోవ్‌స్కీ కలిశారు. ఏఐ, రోబోటీకరణకు సంబంధించి తమ శాఖ నిబంధనల రూపకల్పనపై పనిచేస్తోందని తెలిపారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్‌లో చర్చిస్తున్న ప్రణాళికల్లో ఉద్యోగులకు తగిన రక్షణ లేదని నిరసన నిర్వాహకుల్లో ఒకరు అభిప్రాయపడ్డారు.
ఆటోమేషన్ కారణంగా కొందరికి కొత్త అవకాశాలు లభిస్తే.. మరికొందరు తిరిగి శిక్షణ పొందాల్సి రావచ్చని, పూర్తిగా కొత్త విధుల్లోకి మారాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చని ‘డెమోక్రాటిజం’ పేర్కొంది. ఈ మార్పులకు ప్రజలను సిద్ధం చేసే బాధ్యత ఎవరిది? మార్పు సమయంలో కార్మికులకు ఎలాంటి రక్షణ కల్పించాలి? నైపుణ్యాల పునరాభివృద్ధి ఎలా జరగాలి? అనే అంశాలపై సమాజంలో చర్చ జరగాలని కోరింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates