మనుషులను గోకుతూ.. నెలకు రూ.14 లక్షలు సంపాదిస్తున్నాడు!

ఎక్కడైనా దురద పెడితే చేతితో గోక్కుంటాం. లేదంటే పక్కన ఉన్నవాళ్లను కాస్త గోకమని అడుగుతాం. కానీ చైనాలో మాత్రం ఇదే ఇప్పుడు ఒక బిజినెస్ అయిపోయింది. షెన్‌జెన్‌కు చెందిన 32 ఏళ్ల జాంగ్ జియావోకియావో ఏకంగా గోకడం కోసమే రెండు ప్రత్యేక స్టోర్లను ప్రారంభించాడు. ఒక్క గంట గోకించుకోవాలంటే 300 యువాన్లు, అంటే దాదాపు రూ.4,400 చెల్లించాలి.

ఈ స్టోర్లలో కస్టమర్లు మసాజ్ సెంటర్‌లో మాదిరిగానే పడుకుంటారు. అక్కడ పనిచేసే సిబ్బంది ప్రత్యేకంగా పెంచిన పొడవాటి గోళ్లతో వీపు, చేతులు, కాళ్లు సహా కస్టమర్ కోరుకున్న చోట గోకుతారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి, రిలాక్స్ కావడానికి, నిద్ర బాగా పట్టడానికి ఈ సర్వీస్ ఉపయోగపడుతుందని జాంగ్ చెబుతున్నాడు. అతని దగ్గరకు వచ్చే కస్టమర్లలో దాదాపు 70 శాతం మంది పురుషులే.

ఈ ఐడియా కూడా జాంగ్‌కు అనుకోకుండా వచ్చింది. గతేడాది సోషల్ మీడియాలో ఓ మహిళ తన భర్త వీపు గోకుతున్న వీడియో చూశాడు. దాని కింద చాలామంది ఇలాంటి సర్వీస్ ఉంటే డబ్బులు ఇచ్చి మరీ చేయించుకుంటామని కామెంట్స్ పెట్టారు. చిన్నప్పుడు తన తండ్రి వీపు గోకితే తాను హాయిగా నిద్రపోయేవాడినని గుర్తొచ్చిన జాంగ్, అదే ఐడియాను బిజినెస్‌గా మార్చేశాడు. మే నెలలో బావోన్ జిల్లాలో మొదటి స్టోర్ తెరిచిన జాంగ్, నెల రోజులకే ఫుటియన్ జిల్లాలో రెండో బ్రాంచ్ ప్రారంభించాడు. 

ఇప్పుడు రెండు స్టోర్లు కలిపి నెలకు దాదాపు లక్ష యువాన్లు సంపాదిస్తున్నట్లు అతను చెప్పాడు. మన కరెన్సీలో అది సుమారు రూ.14.7 లక్షల గ్రాస్ రెవెన్యూ. ఖర్చులు పోగా ఇప్పటికే లాభాల్లోకి కూడా వచ్చినట్లు తెలిపాడు. ఇంతకుముందు జాంగ్ చేసిన బిజినెస్ ప్రయత్నాలు మాత్రం పెద్దగా కలిసి రాలేదు. చదువు పూర్తయ్యాక ఒకే ఏడాదిలో ఏడు రకాల ఉద్యోగాలు చేశాడు. తర్వాత రెండు ఈ కామర్స్ కంపెనీలు ప్రారంభించినా అవి నిలబడలేదు. సోషల్ మీడియా కంటెంట్ రంగంలో కూడా ప్రయత్నించాడు. ఇప్పుడు ఈ గోకే సర్వీస్‌తో చైనా మొత్తం 100 స్టోర్లు తెరవాలని ప్లాన్ చేస్తున్నాడు.