అయోమయంలో ఇస్రో అధికారులు?

దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవిష్యత్తు ప్రమాదంలో పడిందా అంటే అవుననే చెప్పాలి. అత్యంత తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్న ఇస్రోకు అంతర్జాతీయంగా ఎంతో పేరుంది. అదే ఇప్పుడు సమస్యగా మారినట్లు కనిపిస్తుంది. ఇన్నాళ్లు ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వరంగ సంస్థలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మెలమెల్లగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇస్రో వెళుతున్న సూచనలు కానవస్తున్నాయన్న కథనాలను ప్రజలు సునిశితంగా పరిశీలిస్తున్నారు.

ఇస్రోలో ప్రైవేటు వ్యక్తులకు భాగస్వామ్యం కల్పిస్తున్నారని ఉద్యోగులు ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. మోదీ ప్రభుత్వం ఆరేళ్ళ కిందటే ఈ నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు దాన్ని అమలులోకి తెచ్చినట్లు మేధావులు చెబుతున్నారు. ప్రభుత్వం దీన్ని ఖండిస్తుంది. ఇస్రోను ప్రైవేటీకరించడం లేదని, ఇస్రోలో ఇప్పటికే తయారు చేసి విజయవంతమైన పీఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి వంటి పాత రాకెట్లు, సాధారణ స్థాయి ఉపగ్రహాల తయారీ భాద్యతలను మాత్రమే ప్రైవేటు కంపెనీలకు బదిలీ చేస్తున్నట్లు చెబుతుంది. దీనివల్ల శాస్త్రవేత్తల మీద పనిభారం తగ్గుతుందని, గగన్ యాన్ వంటి ఆధునాతన ప్రయోగాలపై మరింతగా శ్రద్ధ చూపించే వెసులుబాటు దొరుకుతుందని వాదిస్తుంది .

ప్రభుత్వం చెబుతున్న ఈ మాటలను ఇస్రో ఉద్యోగులు నమ్మడం లేదు. ప్రభుత్వం, అధికారులు షుగర్ కోటెడ్ లాంగ్వేజీలో మాట్లాడుతున్నారని, ఉద్యోగులను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గగన్ యాన్ మిషన్లో కీలకమైన ఎల్వీఎం -3 శాస్త్రవేత్త విక్టర్ జోసెఫ్ రాజీనామా చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు సామాన్యులకు ఇస్రో దారిదాపుల్లోకి అనుమతి లభించేది కాదని, అలాంటి కీలక వ్యవస్థలో ప్రైవేటు వ్యక్తులకు ఏకంగా భాగస్వామ్యం ఎలా ఇస్తారని ఇస్రో ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇస్రో టెక్నాలజీని బదిలీ చేయడం సమర్ధనీయం కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుండగా ఆమధ్య ఇస్రోకు చెందిన 100 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు రాజీనామా చేయడం దేశంలో కలకలం సృష్టించింది. బెంగుళూరు, తిరువనంతపురం కేంద్రాల నుంచి ఎక్కువగా రాజీనామాలు చేశారు. దీనికి ప్రధాన కారణం ఇస్రోలో వేతనాలు చాలా తక్కువగా ఉండటం. పరిపాలనాపరంగా నిర్లక్ష్యం ఎక్కువైందన్న మాట వినిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు కంపెనీలకు పెద్దపీట వేయడంతో అక్కడ అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి. దీంతో శాస్త్రవేత్తలు ఇస్రోకు టాటా, బై బై చెప్పేస్తున్నారు. ఇదే పరిస్థితి మరికొన్నాళ్ళు కొనసాగితే ఇస్రో మరో బీఎస్ఎన్ఎల్ లాగ తయారుకావడం ఖాయమని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.