ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ నిజం చేసి చూపించారు. అయితే.. ఆయనకు ఎవరో దీనిని శిక్షగా వేసింది కాదు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానమే.. ఇంత సమయం ఆయనను నిలబెట్టింది. ఎక్కడా విసుగు విరామం లేకుండా నారా లోకేష్.. ఏడున్నరగంటల పాటు నిలబడి.. ప్రజలకు సేవలు అందించారు. ఏడున్నర గంటలు నిలబడినా ప్రతి క్షణంలోనూ ఆనందంగానే కనిపించారు.
రీజనేంటి?
మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోకేష్.. ఇక్కడి పేదలకు భూములకు సంబంధించిన పట్టాలను పంచుతున్నారు. ఇక్కడి వారు గతంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. వాటికి ఇప్పటి వరకు ఎలాంటి పట్టాలు లేవు. అయినా.. మరోగూడు లేకపోవడంతో అక్కడే ఉంటున్నారు. ఆయా స్థలాల్లో ఏర్పాటు చేసుకున్న ఇళ్లలోనే శుభకార్యాలు కూడా నిర్వహించుకుంటున్నారు. 2024 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన లోకేష్.. వీరిని కలిసి.. సమస్యలు ఆలకించారు. తనను గెలిపిస్తే.. అర్హులైన వారికి ఉన్న చోటే పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో గత రెండేళ్లుగా మంగళగిరి నియోజకవర్గంలోని కొండ ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నివాసం ఉంటున్న పేదలకు ఇంటి పట్టాలను పంపిణీ చేస్తున్నారు. దీనికి మన ఇల్లు-మన లోకేష్ అనే పేరును కూడా పెట్టడం గమనార్హం. తాజాగా 1331 మంది కుటుంబాలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. వీరందరినీ ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిచిన నారా లోకేష్.. ఉదయం 9 గంటల నుంచే పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇలా 7 గంటలకు పైగా ఆయన నిలువుకాళ్లపై నిలబడి.. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.
కేవలం పట్టాలే కాదు.. 1331 మంది కుటుంబాల్లోని పట్టాదారు అయిన మహిళలకు పసుపు కుంకుమ కింద చీర కూడా అందించారు. ప్రతి కుటుంబానికీ కిలో మిఠాయి ప్యాకెట్ కూడా అందించారు. అంతేకాదు.. కుటుంబం మొత్తానికీ మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ కార్యక్రమం ద్వారా మంగళగిరి శివారు సహా .. కొండ ప్రాంతాల్లోని వారికి ఎంతో మేలు జరుగుతుందని మంత్రి లోకేష్ చెప్పారు. అయితే.. మరింత మంది లబ్ధిదారులు ఉన్నారని, వారికి కూడా విడతల వారీగా పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. పేదలకు కనీసం గూడు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఈ సందర్భంగా లోకేష్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates