రోహిత్ శర్మ ఈజ్ బ్యాక్.. నటరాజన్‌కు లేదు ఛాన్స్

ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు పర్యటన అనేక మలుపులతో సాగుతున్న సంగతి తెలిసిందే. ముందుగా రెండు వన్డేల్లో ఓటమి పాలై పేలవంగా పర్యటనను ఆరంభించిన భారత్.. ఆ తర్వాత పుంజుకుని వరుసగా ఒక వన్డే, రెండు టీ20ల్లో గెలిచి ఆతిథ్య జట్టుకు దీటుగా నిలిచింది. లిమిటెడ్ ఓవర్స్ సిరీస్‌లో ఇరు జట్లూ మూడేసి మ్యాచ్ ‌లు గెలిచి సమాన స్థితిలో నిలిచాయి.

ఐతే టెస్టు సిరీస్‌లో మాత్రం ఆసీస్ ముందు టీమ్ ఇండియా నిలవలేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్లే తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది టీమ్ ఇండియా. ఈ మ్యాచ్ తర్వాత కోహ్లి భార్య ప్రసవం కోసం స్వదేశానికి వచ్చేయడం, గాయంతో షమి సిరీస్‌కు దూరం కావడంతో ఇక భారత జట్టు పనైపోయిందని అందరూ తీర్మానించేశారు. కానీ రెండో టెస్టులో గొప్పగా పుంజుకున్న భారత్.. అద్భుత విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

ఇప్పుడిక మూడో టెస్టుకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచే సిడ్నీలో మ్యాచ్ జరగబోతోంది. తొలి టెస్టు తర్వాత తుది జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేసి రెండో టెస్టులో బరిలోకి దిగింది భారత్. మూడో టెస్టుకు మళ్లీ జట్టులో మార్పులు తప్పలేదు. మ్యాచ్‌కు ఒక రోజు ముందే భారత్ జట్టును ప్రకటించింది. ఈసారి రెండు మార్పులు జరిగాయి. స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో.. అతడి కోసం ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మీద వేటు వేశారు. తొలి రెండు టెస్టుల్లో అతను పేలవ ప్రదర్శన చేశాడు. రెండో టెస్టుతోనే అరంగేట్రం చేసి ఆకట్టుకున్న శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. ఇక గత మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ గాయపడి సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలోకి నవదీప్ సైనిని ఎంచుకున్నారు. అతడికిదే తొలి టెస్టు మ్యాచ్.

నిజానికి ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శన చేసి.. ఆ తర్వాత అనుకోకుండా ఆస్ట్రేలియాతో వన్డేలు, టీ20ల్లో ఆడి సత్తా చాటిన తమిళనాడు ఫాస్ట్ బౌలర్‌ నటరాజన్‌కు ఈ టెస్టులో అవకాశం దక్కుతుందేమో అన్న చర్చ జరిగింది. కానీ అతడిని కాకుండా అంతర్జాతీయ అనుభవం ఎక్కువ ఉన్న సైనిని ఎంచుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టులోకి స్టార్ ఓపెనర్ వార్నర్ వస్తున్నాడు. భారత జట్టు అతడితో జాగ్రత్తగా ఉండాల్సిందే.