కుంభ‌మేళాలోనే అయోధ్య దోపిడీకి బీజం…?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత అయోధ్య బాల రామ‌య్య‌కు భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల దోపిడీ వ్య‌వ‌హారంలో కీల‌క విష‌యం వెలుగు చూసింది. ఈ దోపిడీకి స్కెచ్ ఇప్పుడు కాద‌ని.. గ‌త ఏడాది జ‌రిగిన కుంభ‌మేళా స‌మ‌యానికి ముందే స్కెచ్ వేశార‌ని అధికారులు తెలిపారు. ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌కు ప్రాధ‌మిక నివేద‌కను అందించారు. మొత్తం 8 మంది నిందితుల‌ను అరెస్టు చేశామ‌ని తెలిపారు. అయితే.. వాస్త‌వానికి ఇంకా ఎక్కువ మంది పాత్ర ఉంద‌ని తెలిపారు.

ఏంటీ కుంభ‌మేళా..

దాదాపు 30 ఏళ్ల‌కు ఒక్క‌సారి వ‌చ్చే త్రివేణీ సంగమ పుష్క‌రాన్నే మహా కుంభ‌మేళాగా పిలుస్తారు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి-ఏప్రిల్ మ‌ధ్య యూపీలో దీనిని అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా హిందువులు కోట్ల మంది ఇక్క‌డ‌కు వచ్చి గంగ, య‌మున, స‌ర‌స్వ‌తి న‌దుల సంగ‌మ ప్రాంతంలో పుణ్య‌స్నానాలు చేశారు. ఇది అత్యంత కీల‌క క్ర‌తువుగా ప్ర‌భుత్వం పేర్కింది. అయితే..ఈ ర‌ద్దీ స‌మ‌యంలో అయోధ్య విరాళాల లెక్కింపున‌కు నియోగించిన ఉద్యోగులు ప‌క్కా ప్లాన్ చేశార‌ని అధికారులు తెలిపారు. భ‌క్తుల రాక‌తో ఇటు ఆల‌య అధికారులు, అటు ప్ర‌భుత్వ అధికారులు కూడా క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపారు.

ఇదే అదునుగా.. విరాళాల‌ను దారిమ‌ళ్లించార‌ని.. అప్ప‌ట్లోనే కోట్ల రూపాయ‌ల‌ను దోచుకున్నార‌ని.. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు నిగ్గు తేల్చారు. అయితే.. అప్ప‌ట్లో దీనిని గుర్తించ‌క‌పోవ‌డం.. దోపిడీ కూడా స‌వ్యంగా సాగిపోవ‌డంతో నిరాఘాటంగా దోపిడీ వ్య‌వ‌హారం ముందుకు సాగింద‌న్నారు. సీసీటీవీ కెమెరాలు ఉన్నా.. దోపిడీ దారులు ఏమాత్రం వాటికి భ‌య‌ప‌డ‌లేద‌ని తెలిపారు. అంతేకాదు.. త‌లా ఇంత‌ని పంచుకోవ‌డంలోనూ ముంద‌స్తు ఒప్పందాల మేర‌కు అంద‌రూ స‌ర్దుకుపోయార‌ని వివ‌రించారు. ఈ వ్య‌వ‌హారం రామ‌జ‌న్మ‌భూమి ట్ర‌స్టులోని కొంద‌రికి తెలుసున‌ని.. వారిని కూడా విచారించాల్సి ఉంద‌ని తాజాగా స‌మ‌ర్పించిన నివేదిక‌లో స్ప‌స్టం చేశారు.

ఎలా దోచారంటే..

1) విరాళల‌ను లెక్కించేందుకు వ‌చ్చిన వారిలో బంధువుల‌ను, మిత్రుల‌ను ఏర్పాటు చేసుకున్నారు
2) ముందుగానే ప‌క్కా స్కెచ్ వేసుకున్నారు. దీనిని అంద‌రూ తూచ త‌ప్ప‌కుండా పాటించేలా టైమ్ టేబుల్ కూడా అనుస‌రించారు.
3) సీసీ టీవీ కెమెరాల ముందు.. అడ్డుగా నిల‌బ‌డడ‌మే కొంద‌రు ప‌నిగా పెట్టుకున్నారు.
4) విరాళాల‌కు సంబంధించిన నోట్ల‌ను క‌ట్ట‌లుగా క‌ట్టే క్ర‌మంలో 100 నోట్ల‌కు బ‌దులుగా మ‌రో 100 నోట్ల‌ను క‌లిపి క‌ట్టారు.
5) ఆల‌యం నుంచి బ్యాంకుకు వెళ్లే మార్గంలో వీటిలో అద‌నంగా ఉన్న 100 నోట్ల‌ను త‌ప్పించి.. సొంతం చేసుకున్నారు.
6) ఆల‌యం నుంచి బ్యాంకుకు వెళ్లే వాహ‌న డ్రైవ‌ర్ల‌నుకూడా సొంత వారిని నియ‌మించుకున్నారు. వారికి కూడా ముడుపులు అందాయి.
7) ఫ‌లితంగా మార్గంమ‌ధ్యలోనే.. వాహ‌నాలు ఆప‌డం.. వాటిలో న‌గ‌దును ప‌క్క‌దారి ప‌ట్టించ‌డం వంటివి చేశారు.
8) ఇది ఒక గ్రూపు ప‌క్కాగా ప్లాన్ చేస్తే.. మ‌రో గ్రూపు అమ‌లు చేసింది.
9) దోపిడీని ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌రింగ్ చేసి.. మార్పులు చేర్పులు చేశారు.
10) ఎవ‌రికీ అనుమానం రాకుండా.. వ్య‌వ‌హ‌రించ‌డంతోపాటు.. నిధుల‌ను కొట్టేసి.. వాటితో పంక్ష‌న్లు కూడా నిర్వ‌హించారు.