పాస్‌పోర్ట్, ఆధార్, ఈపీఎఫ్‌ఓ… మారిన రూల్స్ ఇవే

జూలై 1వ తేదీ వచ్చేసింది. ఈ రోజు మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌పై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన ఆర్థిక మార్పులు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి గట్టి షాక్ తగిలింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫీజులను భారీగా పెంచేసింది. సాధారణ 36 పేజీల పాస్‌పోర్ట్ బుక్‌లెట్ ఫీజు 1,500 రూపాయల నుంచి ఒక్కసారిగా 2,500 రూపాయలకు చేరింది. ఇదే బుక్‌లెట్‌ను అర్జంట్‌గా తత్కాల్ పద్ధతిలో పొందాలంటే ఇకపై ఏకంగా 5,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 60 పేజీల పాస్‌పోర్ట్, మైనర్ల దరఖాస్తుల ధరలను కూడా ప్రభుత్వం సవరించింది. ఈ కొత్త రేట్లు విదేశాల్లో ఉండే భారతీయులకు కూడా వర్తిస్తాయి.

మరోవైపు డిజిటల్ సేవల పరంగా కొన్ని కీలక అప్‌డేట్స్ వచ్చాయి. ఆధార్ కార్డు ఉన్నవారికి యూఐడీఏఐ ఒక మంచి ఊరటనిచ్చింది. ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడీని లింక్ చేసుకోవడం లేదా అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని పూర్తిగా ఉచితం చేసింది. జూలై 1వ తేదీన ప్రారంభమైన ఈ ఫ్రీ సర్వీస్ డిసెంబర్ 31 వరకు ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుంది.

ఇక గత ఐదు రోజులుగా నిలిచిపోయిన ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌ఓ) ఆన్‌లైన్ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. సిస్టమ్ భద్రత, వేగాన్ని పెంచేందుకు జూన్ 26, జూన్ 30 మధ్య నిర్వహించిన మెయింటెనెన్స్ క్లోజ్ అవ్వడంతో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మెంబర్ పోర్టల్ పనులు మళ్లీ షురూ అయ్యాయి.

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కూడా సమయం దగ్గరపడుతోంది. ఎలాంటి లేట్ ఫీజు లేదా పెనాల్టీలు లేకుండా ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 ఫారమ్‌ల ద్వారా ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 ఆఖరి తేదీగా నిర్ణయించారు. కేవలం జీతం, బ్యాంకు వడ్డీ ద్వారా ఆదాయం పొందే సామాన్యులు ఐటీఆర్ 1 ఫైల్ చేయవచ్చు. అదే ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉన్నా, షేర్ మార్కెట్ లాభాలు ఉన్నా లేదా వార్షిక ఆదాయం 50 లక్షల రూపాయలు దాటినా ఐటీఆర్ 2 ఎంచుకోవాలి. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు రాకుండా పన్ను నిపుణులు ముందే హెచ్చరిస్తున్నారు.

ఇక ఇంట్లో గ్యాస్ కనెక్షన్ వాడే వారి నియమాల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్, పీఎన్‌జీ పైప్‌లైన్ కనెక్షన్లు రెండూ ఉన్నవారు పూర్తిగా పీఎన్‌జీ కి మారడానికి జూన్ 30తో గడువు ముగిసింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఎల్‌పీజీ సప్లై నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకవేళ ఎవరైనా పీఎన్‌జీ సేవలు లేని కొత్త ప్రాంతానికి బదిలీ అయితే మాత్రం పాత గ్యాస్ కనెక్షన్‌ను మళ్లీ యాక్టివేట్ చేసుకోవడానికి అధికారులు అనుమతి ఇస్తారు.