వైభవ్ ఎంట్రీ ఎందుకు ఆపారు… కోచ్ చెప్పిన నిజమిదే!

ఐపీఎల్ 2026 సీజన్ లో 230 కి పైగా స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా నిలిచాడు వైభవ్ సూర్యవంశీ. అయితే ఐర్లాండ్ టూర్‌లో ఈ పదిహేనేళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వకపోవడంపై అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దానికి తోడు ఈ టీ20 సిరీస్‌ను భారత్ 0-2తో క్లీన్ స్వీప్ అవ్వడం, ఆఖరి మ్యాచ్ లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం మరింత కాంట్రవర్సీ అయ్యింది.

ఈ నేపథ్యంలోనే వైభవ్ సెలెక్షన్ పై వస్తున్న విమర్శలకు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో క్లారిటీ ఇచ్చారు. భారత జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచనా విధానం మరోలా ఉందని కోచ్ మాటలను బట్టి అర్థమవుతోంది. మూడు నెలల క్రితం టీమిండియాకు వరల్డ్ కప్ అందించడంలో సంజూ శాంసన్ లాంటి సీనియర్లు కీలక పాత్ర పోషించారని, వారికి ఐపీఎల్ లో మంచి ట్రాక్ రికార్డ్ ఉందని ఆయన గుర్తు చేశారు. ఒకట్రెండు మ్యాచ్ ల వైఫల్యంతో ప్లేయర్లను పక్కన పెట్టేయలేమని, ఆటగాళ్లకు పూర్తి నమ్మకాన్ని ఇస్తూ జట్టులో సుదీర్ఘమైన అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

వైభవ్ ప్రతిభావంతుడే అయినప్పటికీ, సీనియర్ల స్థానాలను భర్తీ చేసేటప్పుడు కొన్ని లెక్కలు ఉంటాయని చెప్పుకొచ్చారు. వైభవ్ ఎంట్రీ కోసం జట్టు ఒక పద్ధతిని అనుసరిస్తోందని, మిగిలిన ఆటగాళ్లలాగే అతను కూడా ఈ సెలెక్షన్ ప్రాసెస్‌ను దాటుకుని రావాల్సి ఉంటుందని డోస్కాట్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ చెప్పిన మాటలనే ఆయన కూడా చెప్పారు. వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాడని, అతని బ్యాటింగ్ పట్ల తమకు ఎలాంటి అపనమ్మకం లేదని వెల్లడించారు.

ఈ కుర్రాడిని మైదానంలో చూడటానికి కోచింగ్ స్టాఫ్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని, కాకపోతే దానికి సరైన సమయం రావాలని అంచనా వేస్తున్నారు. ఐర్లాండ్ టూర్ ముగిసిన వెంటనే భారత్ జూలై 1 నుంచి ఇంగ్లాండ్‌తో చెస్టర్ లీ స్ట్రీట్‌లో టీ20 సిరీస్ ఆడబోతోంది. ఈ ఇంగ్లాండ్ పర్యటనలోనైనా వైభవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతుందా అనే అంశంపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. ఒకవేళ ఇంగ్లాండ్ మ్యాచ్ లలో అతను అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడితే, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న దశాబ్దాల నాటి రికార్డు బ్రేక్ అవుతుంది.