షాకింగ్ విషాద ఉదంతం శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు, నాణ్యమైన వైద్య సేవల్ని అందించే క్రమంలో..వేలాది కిలోమీటర్లు ప్రయాణించినప్పటికి చిట్టితల్లి ప్రాణాలు గాల్లోనే కలిసిపోయిన దురదృష్టకర విషాద ఉదంతానికి శంషాబాద్ విమానాశ్రయం సాక్ష్యంగా నిలిచింది. విన్నంతనే అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..
తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియాకు చెందిన పదమూడేళ్ల బాలిక (హెవెన్ బెయెనె) కొంతకాలంగా తీవ్రమైన బోన్ క్యాన్సర్ తో బాధ పడుతోంది. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరు.. హైదరాబాద్ లో అయితే మెరుగైన వైద్యం అందుతుందని ఆశించారు. బాలిక ఎదుర్కొంటున్న బోన్ క్యాన్సర్ కు ఇథియోపియాలో సరైన వైద్య సదుపాయాలు లేని దుస్థితి. దీంతో.. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందించేలా బాలిక కుటుంబం ప్లాన్ చేసుకున్నారు.
శనివారం ఉదయం (తెల్లవారుజామున)ఇథియోపియా రాజధాని అడ్డిస్ అబాబా నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఇతియోపియన్ ఎయిర్ లైన్స్ లో బాలిక.. ఆమె తల్లి.. సమీప బంధువు కలిసి బయలుదేరారు. షెడ్యూల్ లో భాగంగా శంషాబాద్ లో ల్యాండ్ అయ్యే సమయానికి అనూహ్యంగా తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో.. పైలెట్ ఇచ్చిన సమాచారంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
ముందుగా వేసుకున్న షెడ్యూల్ ప్రకారం భారత సరిహద్దుల్లోని ప్రవేశించిన తర్వాత సదరు బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్రమైన శ్వాసకోస ఇబ్బందులు తలెత్తటం.. పల్స్ రేటు పడిపోయాయి. ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా.. ఎలాంటి ఫలితం లేదనే చెప్పాలి. వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి సరిగ్గా హైదరాబాద్ కు వచ్చే సమయానికి ప్రాణాలు కోల్పోయిన వైనం తిరుగురాని లోకాలకు తీసుకెళ్లిందని చెప్పాలి. అయ్యో అనిపించే ఈ ఉదంతం గురించి మరిన్ని వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates